“ఈగ ఈగ ఈగ యముడి మెరుపు తీగ… ఈజీ ఈజీ ఈజీ గా తేరి జాన్ లేగ…” అంటూ ఈగ వెండితెరపై చిందులు వేస్తోంటే ఆబాలగోపాలం కేరింతలు కొట్టారు. గ్రాఫిక్స్ తో మాయాజాలం చేయడంలో తెలుగునాట తనకు తానే సాటి అనిపించుకున్న రాజమౌళి సీజీలో ఈగను క్రియేట్ చేసి ఈజీగా జనం మదిని దోచేశారు. సరిగా పదేళ్ళ క్రితం జూలై 6న ‘ఈగ’ ప్రేక్షకుల ముందు నిలచింది. వారి మదిని గెలిచింది. బాక్సాఫీస్ నూ షేక్ చేసింది. 2012లో విడుదలైన టాప్ గ్రాసర్స్ లో ఒకటిగా ‘ఈగ’ నిలచింది.
‘ఈగ’ కథనే ‘బెడ్ టైమ్ స్టోరీ’లా ఉంటుంది. ఓ తండ్రి తన కూతురుకు చెప్పే కథ ఇది. కాబట్టి ఇందులోని అభూత కల్పనలను ‘ఫెయిరీ టెయిల్’లాగే తీసుకోవాలి కానీ, భూతద్దం వేసి తప్పులు వెదుకరాదని ఆరంభంలోనే చెప్పేశారు దర్శకుడు. ఇంతకూ ‘ఈగ’ కథ ఏమిటంటే – నాని ఓ ఫైర్ వర్క్స్ లో పనిచేస్తుంటాడు. అతని వీధిలోనే ఉన్న బిందును ప్రేమిస్తుంటాడు. బిందు ఓ ‘మినీయేచర్ ఆర్టిస్ట్’. ఆమె ప్రాజెక్ట్ 511 అనే యన్టీవోను నడుపుతూ ఉంటుంది. ఫండ్స్ కోసం సుదీప్ అనే టైకూన్ దగ్గరకు వెళ్తుంది. జనాన్ని కొల్లగొట్టి సంపాదించిన సుదీప్, బిందు అందం చూసి ఆకర్షితుడవుతాడు. ఆమెను ఆకట్టుకోవడం కోసం అన్నట్టు 15 లక్షల రూపాయలు విరాళం ఇస్తాడు. ఎలాగైనా ఆమెను తన దానిగా చేసుకోవాలని చూస్తోన్న సుదీప్ కు ఆమెకు నాని అంటే ఇష్టం అని తెలుస్తుంది. దుర్మార్గుడైన సుదీప్, నానిని కిడ్నాప్ చేసి చంపేస్తాడు. చనిపోతూ నాని ‘నీ అంతు చూస్తా’ అంటాడు. తరువాత నాని ‘ఈగ’గా పుడతాడు. మళ్ళీ బిందు దగ్గరకు వస్తాడు. ఆమెకు ఆ ఈగ ఎందుకలా తన వెంటపడుతోందో అర్థం కాదు. ఈగ తాను ‘నాని’ని అని రాస్తుంది. మళ్ళీ బిందు ప్రేమ పొందుతుంది. ఇక సుదీప్ వెంట పడి, అతడిని ఎంతగానో డిస్టర్బ్ చేస్తుంది ఈగ. అతని కారు యాక్సిడెంట్ అయ్యేలా చేసి, కారు అద్దంపై ‘ఐ విల్ కిల్ యు’ అని రాస్తుంది. ఈగ నుండి తప్పించుకోవడానికి సుదీప్ నానా తంటాలు పడతాడు. మొత్తానికి ఈగలా పుట్టిన నాని, సుదీప్ సామ్రాజ్యాన్ని అగ్నిప్రమాదానికి గురయ్యేలా చేసి అతడిని అంతం చేస్తాడు. చివరగా బిందు గుడికి వెళ్ళి, తాను ఈగను పెళ్ళాడుతున్నట్టు చెబుతుంది. కానీ, అది అర్థం కాని పూజారి, ఆమె పక్కనే ఉన్న దొంగను పెళ్ళాడాతనని చెబుతుందేమో అని భావిస్తాడు. ఇలా తికమకగా సాగుతుండగా, బిందును చూసి వెకిలి వేషాలు వేస్తున్న ఒకడికి ఈగ వెంటపడి మరీ వాడిని డిస్టర్బ్ చేసి, కింద పడేయడంతో కథ ముగుస్తుంది.
బైబిల్ లోని ‘డేవిడ్ అండ్ గోలియత్’ కథ స్ఫూర్తితో ఈ స్టోరీని రూపొందించామని రాజమౌళి చెప్పారు. చిన్నవాడయిన డేవిడ్, అతి భయంకరుడైన గోలియత్ ను వడిసెలతో ఎలా కొట్టి పడేశాడు అన్న అంశంలాగే ఇందులోనూ ఈగలా జన్మించిన హీరో తన శక్తియుక్తులన్నీ ఉపయోగించి, ప్రతినాయకుడిని అంతం చేయడం కనిపిస్తుంది.
ఈ చిత్రంలో సుదీప్, నాని, సమంత, ఆదిత్య, తాగుబోతు రమేశ్, ఛత్రపతి శేఖర్, నోయెల్, శ్రీనివాస రెడ్డి, దేవదర్శిని, రాజీవ్ కనకాల, ధన్ రాజ్, హంసానందిని నటించారు. ఈ చిత్రానికి కీరవాణి బాణీలు కట్టగా, “ఈగ ఈగ ఈగ…” పాటను రామజోగయ్య రాశారు; “కొంచెం కొంచెం…” అంటూ సాగే పాటను అనంత శ్రీరామ్, “లవ లవ…” అనే పాటను చైతన్య ప్రసాద్, “నేనే నానినే…” అనే పాటను కీరవాణి పలికించారు. ఈ సినిమా తమిళంలో ఏక కాలంలోనే ‘నాన్ ఈ’ అనే పేరుతో రూపొందింది. అందులో సంతానం, క్రేజీ మోహన్ నటించారు. ఆ పాత్రల్లో తెలుగులో తాగుబోతు రమేశ్, హంసానందిని కనిపించారు. ‘ఈగ’ చిత్రం ఓపెనింగ్స్ భలేగా రాబట్టింది. నిర్మాత సాయి కొర్రపాటి పెట్టుబడికి మూడంతలు రాబడి వచ్చింది. ‘ఈచ’ పేరుతో మళయాళంలో అనువాదమయింది.
‘ఈగ’ సినిమా ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ అవార్డు సంపాదించింది. దీంతో పాటు బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ లోనూ నేషనల్ అవార్డును సొంతం చేసుకుంది. ఈ చిత్రానికి ‘మకుట వీఎఫ్ఎక్స్’ సంస్థ స్పెషల్ ఎఫెక్ట్స్ రూపొందించింది. టోరంటో ఫిలిమ్ ఫెస్టివల్ లోనూ, షాంఘై చిత్రోత్సవంలోనూ ‘ఈగ’ ప్రదర్శితమై, అంతర్జాతీయ సినిమా అభిమానులనూ ఆకట్టుకుంది.