Ilapavuluri Murali Mohan Rao: ప్రముఖ తెలుగు రచయిత, కాలమిస్ట్ ఇలపావులూరి మురళీ మోహనరావు ఆదివారం అర్థరాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణానికి చెందిన మురళీ మోహన రావు నాలుగైదు దశాబ్దాల క్రితమే హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు. ఆదివారం కార్తీక మాసాన్ని పురస్కరించుకుని కుటుంబ సభ్యులతో అద్దంకి వెళ్ళారు. అక్కడి సమీపంలోని కొత్త పట్నం బీచ్ లో నిన్నంతా గడిపారు. ఆదివారం అర్థరాత్రి హఠాత్తుగా గుండెపోటుకు గురికావడంతో ఒంగోలు హాస్పిటల్ కు తరలించినా, ఫలితం లేకపోయిందని, డాక్టర్లు పరిశీలించే లోపే ఆయన కన్నుమూశారని వారి కుమారుడు ప్రమోద్ మీడియాకు తెలిపారు. తెలుగు భాష మీద మంచి పట్టు ఉన్న ఇలపావులూరి మురళీమోహనరావు దాదాపు 200 కథలు, రెండు శతకాలు, 750కు పైగా వ్యాసాలు, ఎనిమిది నవలలు రచించారు. బాపు దర్శకత్వం వహించిన ‘పెళ్ళిపుస్తకం, మిస్టర్ పెళ్ళాం’ చిత్రాలకు వెండితెర నవలలు రాశారు. ఇవి ‘హాసం’ పక్ష పత్రికలో ప్రచురితమయ్యాయి. ఎనిమిది సినిమాలకూ ఇలపావులూరి రచన చేశారు. ‘హాసం’ పత్రికలో వచ్చిన ‘ఎలుక వచ్చే… ఇల్లు భద్రం’! నవల ఆధారంగా ప్రముఖ దర్శకుడు రేలంగి నరసింహారావు ‘ఎలుకా మజాకా’ సినిమాను రూపొందించారు. సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండే ఇలపావులూరి రాజకీయ విశ్లేషణలు ద్వారా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఆయన మృతికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం తెలిపారు.