ఆహా ఓటీటీలో ప్రసారం అవుతున్న తెలుగు ఇండియన్ ఐడల్ విజేత విషయంలో సస్పెన్స్ వీడిపోయింది. ఫైనల్ కంటెస్టెంట్స్ ఐదుగురితో జరిగిన గ్రాండ్ ఫినాలేలో విజేతగా నెల్లూరుకు చెందిన వాగ్దేవి విజేతగా నిలిచింది. ఈ ఫైనల్ ఎపిసోడ్ ఆహా ఓటీటీలో శుక్రవారం రాత్రి ప్రసారం కానుంది. మెగాస్టార్ చిరంజీవి ఈ గ్రాండ్ ఫినాలేకు ముఖ్యఅతిథిగా హాజరు కాగా, ‘విరాట పర్వం’ మూవీ జోడీ రానా, సాయి పల్లవి ఈ ప్రోగ్రామ్ లో స్పెషల్ అప్పీయరెన్స్ ఇచ్చారు. వాగ్దేవితో పాటు ఆమె అక్క వైష్ణవి సైతం ‘తెలుగు ఇండియన్ ఐడల్’కు హాజరైంది. అయితే మొదటి ఒడపోతలో కేవలం 12 మందిని ఎంపిక చేసినప్పుడు వైష్ణవి పోటీ నుండి నిష్క్రమించింది. ఆ తర్వాత ఒక్కొక్కరి చొప్పున ఎలిమినేట్ చేస్తూ, చివరకు గ్రాండ్ ఫినాలేకు ఐదుగురు కంటెస్టెంట్స్ ను మిగిల్చారు. అందులో మిగిలిన వారిని దాటుకుంటూ వాగ్దేవి విన్నర్ గా నిలవడం విశేషం.
మెగాస్టార్ చిరంజీవికి నెల్లూరుతో అనుబంధం ఉందని, ఆ ఊరికే చెందిన తన కూతురు ఆయన చేతుల మీదుగా తెలుగు ఇండియన్ ఐడల్ ట్రోఫీని అందుకోవడం ఆనందంగా ఉందని వాగ్దేవి తండ్రి చెప్పారు. చిన్నప్పటి నుండే తన సోదరి వైష్ణవితో పాటు వాగ్దేవి సంగీతం నేర్చుకుందని, అయితే కాస్తంత ఆలస్యంగా మ్యూజిక్ క్లాసెస్ కు హాజరైన తను, త్వరగా వాటిని అవగతం చేసుకునేదని కితాబిచ్చారు. తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్స్ ఎన్ని జరిగినా, తొలి విజేతగా తన కూతురు నిలవడం గర్వంగా ఉందని ఆయన అన్నారు. సింగర్ గా చూడాలన్నది తన తల్లి కోరికని, ఈ కార్యక్రమంలో పాల్గొనడంలో ఆమె ప్రోత్సాహం ఎంతో ఉందని, అందుకే ఈ ట్రోఫీ అమ్మకే అంకితమని వాగ్దేవి చెప్పింది. ‘ఆహా’లో తెలుగు ఇండియన్ ఐడల్ కార్యక్రమం వస్తున్న సమయంలో ఎంతో మంది సినీ ప్రముఖులు తనకు ప్రోత్సాహాన్ని అందించారని వాగ్దేవి తెలిపింది.
ఇళయరాజా, రెహమాన్ ఇష్టం!
ఓ గాయనిగా ఎ. ఆర్. రెహమాన్ సంగీత దర్శకత్వంలో పాడాలన్నది తన కల అని వాగ్దేవి చెప్పింది. అలానే లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా గారి సంగీత దర్శకత్వంలో కోరస్ పాడినా అదృష్టంగా భావిస్తానని తెలిపింది. ఈ కార్యక్రమాన్ని చూసిన ప్రేక్షకులు తన పాటతో కనెక్ట్ అయ్యారని, వారు అభిమానంతో ఓటు వేసినందునే తాను గెలిచానని వాగ్దేవి చెప్పింది. అలా ప్రేక్షకులతో కనెక్ట్ అవ్వడమనేది అదృష్టమని, అది తనకు దేవుడిచ్చిన వరంగా భావిస్తానని తెలిపింది. చదువును పూర్తి చేసి, సింగర్ గా స్థిరపడాలన్నది తన కోరిక అని చెప్పింది.. విశేషం ఏమంటే… కేవలం సింగర్ గానే కాకుండా నటిగానూ కొన్ని చిత్రాలలో అవకాశాలు వాగ్దేవిని పలకరిస్తున్నాయని తెలుస్తోంది.