Tees Maar Khan: Sunil in another different role!
కమెడియన్ నుండి హీరోగా ఎదిగిన సునీల్… అక్కడే ఆగిపోలేదు… హీరోగా నటించిన సినిమాలు చెప్పిన గుణపాఠాలను అర్థం చేసుకుని క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గానూ మారాడు. అతను ప్రతినాయకుడి పాత్ర పోషించిన ‘కలర్ ఫోటో’ మూవీ ఇటీవల ఉత్తమ ప్రాంతీయచిత్రంగా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ఇక ‘పుష్ప’ సినిమాతో సునీల్ పూర్తి స్థాయిలో విలన్ పాత్రలకు సై అనేశాడు. తాజాగా ఆది సాయికుమార్ నటిస్తున్న ‘తీస్ మార్ ఖాన్’ మూవీలోనూ సునీల్ ఓ భిన్నమైన పాత్రను పోషించాడు. ఆ పాత్రకు సంబంధించిన స్పెషల్ పోస్టర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ మూవీలో చక్రి అనే పాత్రలో సునీల్ కనిపించబోతున్నాడు. ఆదిసాయికుమార్, పాయల్ రాజ్ పుత్ జంటగా నటిస్తున్న ‘తీస్ మార్ ఖాన్’ మూవీని కళ్యాణ్ జి గోగణ దర్శకత్వంలో డా. నాగం తిరుపతి రెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఆగస్ట్ 19న విడుదల చేయబోతున్నారు.
సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇది వరకు విడుదల చేసిన పోస్టర్లు, టీజర్లు, పాటలు అందరినీ మెప్పించాయని, వాటికి అన్ని వైపుల నుంచి పాజిటివ్ వైబ్స్ రావడంతో సినిమా మీద అంచనాలు పెరిగాయని, ఈ చిత్రంతో మరోసారి సునీల్ తన నట విశ్వరూపాన్ని చూపించబోతున్నారని దర్శక నిర్మాతలు తెలిపారు. ఆది సాయి కుమార్ పవర్ ఫుల్ పాత్రలో నటించిన ఈ సినిమాను హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు డైరెక్టర్ కళ్యాణ్ జి గోగణ. స్టూడెంట్, రౌడీ, పోలీస్ గా మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రలో ఆది సాయికుమార్ నటించడం ఈ సినిమాకు మేజర్ అసెట్ అని కళ్యాణ్ తెలిపారు.