Tarakaratna: నందమూరి ఇంట విషాదం నెలకొంది. గత కొన్నిరోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నందమూరి తారకరత్న కన్నుమూశారు. నారా లోకేష్ పాదయాత్రలో కళ్ళు తిరిగి పడిపోయిన తారకరత్నను కుప్పం హాస్పిటల్ లో చేర్పించగా అతనికి తీవ్ర గుండెపోటు వచ్చినట్లు వైద్యులు ఖరారు చేశారు. వెంటనే తారకరత్నను మెరుగైన వైద్యం కోసం బెంగుళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో అడ్మిట్ చేసి వైద్యం అందించారు. వైద్యులు ఆయనకు యాంజియోగ్రామ్ చేశారని గుండె రక్తం సరఫరా చేసే నాళాల్లో బ్లాక్ అవ్వడంతో ఆయన పరిస్థితి విషమంగా ఉందని చెప్పుకొచ్చారు. ఇక తారకరత్న మీద అందరు ఆశలు వదులుకుంటున్న సమయంలో బాలకృష్ణ మృత్యుంజయ మంత్రం పని చేసిందని, అంతకు ముందు చికిత్స సహకరించని శరీరం.. ఈ మృత్యుంజయ మంత్రం చదివాకా సహకరించిందని, ఇది మెడికల్ మిరాకిల్ అని చెప్పుకొచ్చారు. ఆ తరువాత తారకరత్న కొద్దికొద్దిగా కోలుకుంటున్నట్లు నందమూరి కుటుంబం చెప్పుకొచ్చింది.
ఇక తాజాగా చికిత్స పొందుతూ తారకరత్న మృతి చెందినట్లు నందమూరి కుటుంబం ప్రకటించింది. బెంగుళూరు వెళ్లిన బాలకృష్ణ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. తారకరత్న తిరిగి వస్తాడని ఆశతో చూసిన నందమూరి అభిమానులకు నిరాశే మిగిలింది. తారకరత్న మృతితో నందమూరి కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఆయన మృతిపట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.