కథలు బాగా రాయాలంటే బాగా పుస్తకాలు చదవాలి అంటారు. అంతకు మించి లోకాన్నీ చదవాలంటారు. అప్పుడే జన ‘నాడి’ తెలుస్తుందనీ చెబుతారు. ఆకట్టుకొనే రచనలు సాగించవచ్చుననీ పెద్దలు తెలిపారు. ఇదే సూత్రం సినిమాల చిత్రీకరణకూ వర్తిస్తుందని పలువురి అభిప్రాయం! పలు దేశవిదేశీ చిత్రాలు చూస్తోంటే, లోకం తీరు తెలుస్తుంది. అలాగే మన చుట్టూ ఉన్న లోకాన్ని పరిశీలిస్తే జనాల అభిరుచీ అవగతమవుతుంది. ఆ పనిచేశాకే సినిమాలు తీస్తే బాగుంటుందని పరిశీలకులు ఏ నాటి నుంచో అంటూనే ఉన్నారు. ప్యాండమిక్ కు ముందు కొన్ని సినిమాలు, ఆ తరువాత వేళ్ళ మీద లెక్క పెట్టదగ్గ చిత్రాలు మాత్రమే బాక్సాఫీస్ వద్ద తమ సత్తా చాటాయి. అధిక శాతం చిత్రాలు ‘చప్ప’గానే సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రేక్షకుల నాడీ పట్టడం ఎలా అన్న సందిగ్ధంలో సినీజనం సతమతమవుతున్నారు. తమ చిత్రాలలో అన్ని రకాల హంగులూ, ఆర్భాటాలూ, భారీతనం చొప్పించినా పరాజయాలు పలకరించడంతో అయోమయంలో కొట్టు మిట్టాడుతున్నారు. మరి జన ‘నాడి’ పట్టడం ఎలా?
‘సెల్’తోనే హెల్
నవతరం ప్రేక్షకుల్లో అధిక సంఖ్యాకులు ‘సెల్ ఫోన్స్’ ఉపయోగిస్తున్నారు. దాంతో వారు కుదురుగా ఉండలేకపోతున్నారు. గంటల తరబడి ఒకే అంశంపై ఎవరూ దృష్టి కేంద్రీకరించడం లేదు. ఇది యువతలో అధికంగా కనిపిస్తున్న అంశం. కాగా, సెల్ ఫోన్ వినియోగం బాగా తెలిసిన ఐదేళ్ళ పైబడి, పన్నెండేళ్ళ లోపున్న వారు ‘వీడియో గేమ్స్’తోనే ఎంజాయ్ చేస్తున్నారు. అంతే కాదు ఆ గేమ్స్ లో ఉపయోగించే చర్యలు సైతం బాలల మనసులపై ప్రభావం చూపిస్తున్నాయి. ఉదాహరణకు ఓ వీడియో గేమ్ లో బైక్ రేసు ఉందనుకోండి, అందులో తాను ఎంచుకున్న బైక్ నడిపే బొమ్మ ఎక్కువ పాయింట్స్ స్కోర్ చేయడానికి తప్పించుకుపోయే వైనంతో బాలలు ఆనందిస్తున్నారు. ఇక కొన్ని గేమ్స్ లో తాను విజేతగా నిలవడానికి, పోటీలో ఉన్న బొమ్మలను చిత్తు చేస్తూ ముందుకు పోతూ ఉండేలా డిజైన్ చేశారు. ఈ తరహా ఆటల కారణంగా చిన్నారి మనసుల్లో పోటీతత్వం పెరగడమే కాదు, తాము విజేతగా నిలవడం అటుంచి, తమను ఎవరైనా డిస్టర్బ్ చేస్తే విపరీతంగా ప్రవర్తిస్తున్నారు. ఇటీవల ఓ అబ్బాయి వీడియో గేమ్ ఆడుతోంటే, తల్లి మందలించిందని ఆమెను చంపేసి, రెండు రోజులు శవాన్ని ఇంటిలోనే దాచేసి ఏమీ తెలియనట్టు ఉన్నాడంటే, ఎంతటి వికృతచేష్టలకు ఈ గేమ్స్ దారి తీస్తున్నాయో ఊహించవచ్చు. ఇలా పిల్లలు, యువకులు సెల్ ఫోన్స్ కే అంకితం కావడంతో సినిమాలకు వసూళ్ళు తగ్గుతున్నాయి. నిజానికి బాలలు, యువతనే సినిమాకు అసలైన రాజపోషకులు. వారిని థియేటర్లకు రప్పించే మాయాజాలాన్ని సినీజనం ఆశ్రయించి తీరాలి.
టీతో పాటు ఓటీటీ
ప్రేక్షకులను ఆకర్షించడం కోసం అన్నట్టు తమ చిత్రాల్లో భారీతనాన్ని చొప్పించేస్తున్నారు సినీజనం. అంతటితో ఆగకుండా తమ చిత్రాల నిర్మాణ వ్యయం పెరిగిందంటూ ప్రభుత్వాల అనుమతితో టిక్కెట్ల రేట్లనూ పెంచేస్తున్నారు. పెంచిన టిక్కెట్ రేట్లు ఓ నిరాశను కలిగిస్తే, మధ్య తరగతివారిలో ‘ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్’ ఆశలు రేకెత్తిస్తున్నాయి. ఎంత భారీ చిత్రమైనా, ఎందరు తారలు నటించిస సినిమా అయినా, విడుదలైన నెల, రెండు నెలల్లోపు ఓటీటీలో ప్రత్యక్షమవుతుందనే ధీమా మిడిల్ క్లాస్ లో చోటు చేసుకుంది. ఈ కారణంగానూ థియేటర్లలో సినిమాల వసూళ్ళు పలచబారుతున్నాయి. భవిష్యత్ లో సినీజనం ఈ ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ తో ఏదైనా తగిన వెసులుబాటు కల్పించుకోవచ్చు. కానీ, సినిమాలను వేలంవెర్రిగా చూసే కుర్రకారును థియేటర్లవైపు తిప్పుకోవడం ఇప్పుడు సినీజనానికి పెద్ద సమస్యగా మారింది.
అవధానమా? అడ్డదారులా?
చాలామంది బాలలు, ఆన్ లైన్ క్లాసులు ఓ వైపు వింటూనే మరో వైపు టీవీలో వచ్చే ప్రోగ్రామ్స్ ను వీక్షిస్తున్నారు. మరికొందరయితే, ఓ సెల్ లో ఆన్ లైన్ క్లాసులు వింటూ, మరో సెల్ లో గేమ్స్ ఆడుకుంటున్నారు. అంతటితో ఆగకుండా, ఎదురుగా టీవీలోనూ తమకు నచ్చిన ఛానెల్ వైపు దృష్టి సారిస్తున్నారు. తమ పిల్లవాళ్ళు ఇలా ఒకే సమయంలో వినోదం, విజ్ఞానం సంపాదిస్తూ ‘అవధానం’ చేస్తున్నారని కొందరు కన్నవారు పొంగిపోతూ ఉన్నారు. అయితే సదరు బాలలు క్లాస్ పరీక్షల్లో తక్కువ మార్కులు తెచ్చుకుంటే తల్లిదండ్రులు లబోదిబో అంటున్నారు. అప్పుడు మాత్రం తమ పిల్లల ‘అవధానం’ పై చిర్రుబుర్రులాడుతూ సెల్ ఫోన్స్ లాగేసుకుంటున్నారు. కొందరు పిల్లలు తమ ఆనందాన్ని కన్నవారు నాశనం చేస్తున్నారని వారిపై పగ పెంచుకుంటున్నారు. అప్పుడే పిల్లల్లో వాటిని మళ్ళీ తమ చేతుల్లోకి తీసుకోవడానికి విపరీత ధోరణులు మొదలవుతున్నాయి. ఇటీవల విడుదలైన ‘ఎఫ్ 3’ మూవీలోనూ ఇలాంటి విపరీత మనస్తత్త్వం ఉన్న పిల్లల మనసుల్ని మళ్ళించే ఉపాయాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి క్లయిమాక్స్ లో చూపించాడు.
ఆకట్టుకొనే ప్రయత్నాలు!
ఇలాంటి విపరీత పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో సినీజనం థియేటర్లకు జనాన్ని రప్పించడానికో, లేదా ఓటీటీల్లో తమ చిత్రాలకు ఆదరణ పెంచడానికో కొత్త మార్గాలు అన్వేషించక తప్పదు. సో, ఇంటిల్లి పాది కలసి చూసే వినోదభరితమైన చిత్రాలలో కాసింత ‘నీతి’నీ చొప్పించే ప్రయత్నం చేయాలి. అందుకోసం తారలు సైతం నిర్మాతదర్శకులకు బాసటగా నిలవాలి. నవతరం భావాలకు అనుగుణంగానూ, వాళ్ళ పెద్దవారి మనస్తత్వాలకు దగ్గరగానూ ఉండేలా కథలు రూపొందించుకోవాలి. ఆకట్టుకోవడానికి భారీతనంపైనే ఆధారపడకుండా, పట్టువున్న కథలనే ఎంచుకోవాలి. ఖర్చు తగ్గించుకొని, థియేటర్లకే జనం వచ్చేలా చేయడానికి సినీజనం అందరూ ఒక్కతాటిపైకి రావలసిందే! బాలలు, యువకులు, వారి పెద్దవారిని సైతం ఆకర్షించే ఏవైనా ‘పథకాలు’ ఏర్పాటు చేయాలి.
కొన్ని ‘జిమ్మిక్స్’ చేయాల్సిందే
తమ సినిమాలకు ఆదరణ పెరగడానికి ఆకర్షవంతమైన పథకాలు నెలకొల్పడం కొత్తేమీ కాదు. సినిమా స్వర్ణయుగం చవిచూస్తున్న రోజుల్లోనే ఈ పద్ధతులు ఉన్నాయి. 1955లోనే తమ సినిమాను అమ్మవారు వచ్చి చూసి, రిక్షావాడిని దీవించిందని ఓ ప్రకటన జారీ చేసి ‘తోడికోడళ్ళు’ చిత్రానికి విపరీతమైన ఆదరణ పెరిగేలా నిర్మాతలు చేశారు. దాంతో రిక్షావాళ్ళు, థియేటర్ కు అదే పనిగా సెకండ్ షోకు వెళ్ళిన వారి సంఖ్య పెరగడం జరిగిందని అప్పట్లో లెక్కలు తేల్చి చెప్పాయి. ఇలాంటి ‘మూఢనమ్మకపు ప్రచారాల’ను ఈ తరం వారు కొట్టేయవచ్చు. అందువల్ల కాసింత ఆలోచించి, యువతరాన్ని ఆకట్టుకొనేలా చిత్రాలు రూపొందించాలి. 1959లోనే విలియమ్ వైలర్ తాను తీసిన ‘బెన్-హర్’కు తగిన ఆదరణ లభిస్తోందో లేదో అనే అనుమానంతో ఓ టెక్నికల్ ఎర్రర్ ను కావాలనే జొప్పించారు. ఆయన ఊహించినట్టుగానే 1925లో వచ్చిన సైలెంట్ మూవీ ‘బెన్-హర్ : ఏ టేల్ ఆఫ్ ద క్రైస్ట్’ బాగుందని జనం తేల్చేశారు. ఓ వారం అయినా కూడా తన భారీ వర్ణచిత్రం ‘బెన్-హర్’ ఊపందుకోక పోవడంతో, అప్పుడు విలియమ్ వైలర్ తన సినిమాలో ఓ చిన్న పొరపాటు దొర్లిందని, ఫలానా తేదీలోగా దానిని కనిపెట్టిన వారికి తగిన బహుమానం ఇస్తామని ప్రకటించారు. దాంతో ప్రేక్షకులు మెల్లగా ఆ పొరపాటేమిటో కనిపెట్టేందుకు థియేటర్లకు వెళ్ళసాగారు. ఓ నాలుగు వారాలు సాగగానే, పొరబాటు కథ పక్కనుంచి, సినిమా భలేగా ఉందంటూ టాక్ మొదలయింది. అయితే, అందులో ‘చారియట్ రేసు’లో ఓ చోట కారు కనిపిస్తుంది. దానిని గమనించి చెప్పిన వారికి విలియమ్ బహుమతులు అందించారు. తరువాత వరల్డ్ క్లాసిక్స్ లో ఒకటిగా విలియమ్ వైలర్ ‘బెన్-హర్’ చోటు సంపాదించింది.
ఇదే తీరున ఓ వైపు శాటిలైట్ ఛానెల్స్ ను, మరోవైపు ఓటీటీని, అన్నిటినీ మించి చేతుల్లోని సెల్ ఫోన్స్ ను తప్పించి, తమ సినిమాలకు జనాలు రావడానికి సినీజనం సైతం ప్రచారంలో కొత్తపుంతలు తొక్కాల్సిందే! అలాగని వాటిలో విపరీత ధోరణులు చొప్పిస్తే మొదటికే మోసం వస్తుంది. తమ చిత్రాల నిర్మాణవ్యయం తగ్గించుకుంటూ, థియేటర్లలో అమలవుతున్న రేట్లతోనే సాగుతూ, ఆబాలగోపాలాన్నీ అలరించేలా చిత్రాలు రూపొందించుకొని సాగాలి. నిర్మాతదర్శకుల ప్రయత్నంలో తారలు సైతం పాలు పంచుకోవాలి. తక్కువ రోజుల్లో ఎక్కువ చిత్రాల్లో నటించడానికి తమ కాల్ షీట్స్ ను సర్దుబాటు చేసుకోవాలి. అప్పుడు ఒకే సినిమాకు భారీ పారితోషికాలు పుచ్చుకోవడం తప్పుతుంది. తమను నమ్ముకున్న సినీ కార్మికులకూ ఉపాధి పెరుగుతుంది. తారల సినిమాలు పెరిగినప్పుడే థియేటర్ల వద్ద కాసింత కళ కనిపిస్తుంది. ఆ దిశగా సినీజనం ఆలోచించి అడుగులు వేస్తారని ఆశిద్దాం.