SS Rajamouli Strong Counter On Britishers Criticism On RRR: దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఎన్ని సంచలనాలు నమోదు చేసిందో అందరికీ తెలుసు! బాక్సాఫీస్ వద్ద కనీవినీ ఎరుగని స్థాయిలో వసూళ్లు కొల్లగొట్టిన ఈ సినిమా.. ఓటీటీలోనూ రికార్డ్ స్థాయి వ్యూవర్షిప్ రాబట్టింది. ఇంకా ఈ సినిమా గురించి చర్చలు జరుగుతూనే ఉన్నాయంటే, సినీ ప్రేక్షకులపై దీని ప్రభావం ఎంతుందో అర్థం చేసుకోవచ్చు. అయితే.. కొందరు బ్రిటీషర్స్ మాత్రం ఈ సినిమాపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తమను తక్కువ చేసి చూపించారంటూ విమర్శలు గుప్పించారు. ఆ విమర్శలకు ఆయన తాజాగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
విలన్ పాత్రలో కేవలం ఒక బ్రిటీష్ వ్యక్తి నటించినంత మాత్రాన బ్రిటిషర్లందరినీ విలన్లుగా చూపించినట్టు కాదని.. ఒకవేళ అందరూ అలా అనుకొని ఉండుంటే బ్రిటన్‌లో ఆర్ఆర్ఆర్ ఇంత భారీ విజయాన్ని సాధించేది కాదని జక్కన్న అభిప్రాయపడ్డారు. ‘‘సినిమా ప్రారంభం అవ్వడానికి ముందు వచ్చే డిస్ల్కైమర్ అందరూ చూసే ఉంటారు. ఒకవేళ అది చూడకపోయినా పర్వాలేదు. ఎందుకంటే.. ఆర్ఆర్ఆర్ ఒక కథ మాత్రమే, పాఠం కాదు. ఈ విషయం హీరోలు, విలన్లుగా నటించిన వారికి తెలుసు. ప్రేక్షకులకూ సాధారణంగానే అర్థమవుతుంది. ఒక స్టోరీ టెల్లర్‌గా ఈ విషయాలు అవగతమైతే, ఇతర వ్యవహారాల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు’’ అని జక్కన్న చెప్పుకొచ్చారు. సూటిగా సుత్తి లేకుండా చెప్పాలంటే.. ఇది కేవలం ఒక సినిమా అని, సినిమాని సినిమాలాగే చూడాలని, అంతే తప్ప ఆలోచనలు చేసుకోవద్దని పరోక్షంగా జక్కన్న సూచించాడన్నమాట!
ఇకపోతే.. ఆర్ఆర్ఆర్‌ను ఆస్కార్స్‌కు పంపకుండా ఫిల్మ్ ఫెవరేషన్ ఆఫ్ ఇండియా ఛెల్లో షోను నామినేట్ చేయడం పట్ల సర్వత్రా అసంతృప్తి వ్యక్తమవుతోంది. అయితే.. యూఎస్‌లో ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేసిన వేరియన్స్ ఫిల్మ్స్ సంస్థ మాత్రం ఆర్ఆర్ఆర్‌ని పరిశీలించాలని అకాడమీని కోరింది. అన్ని కేటగిరీలకు సంబంధించి ఓటింగ్ నిర్వహించేలా ప్రణాళికలు రచిస్తోంది. ఒకవేళ ఏ విభాగంలోనైనా ఆర్ఆర్ఆర్‌ని నామినేషన్స్ లభిస్తే.. ఇతర విభాగాల్లో అర్హత పొందిన తొలి భారతీయ చిత్రంగా ఈ సినిమా నిలవనుంది.