Sr NTR: తన చిత్రాల ద్వారా పరిచయం అయిన వారిని, తనకు పేరు తెచ్చిన సినిమాల్లో నటించిన వారిని కూడా నటరత్న యన్టీఆర్ ఏ నాడూ మరచిపోయేవారు కారు. సదరు నటీనటులకు ఏమైనా ఇబ్బందులు కలిగిన సమయంలో తానే ముందుండి చేయూత నిచ్చేవారు. అలా ఎందరినో యన్టీఆర్ ఆదుకున్న సందర్భాలున్నాయి. ఆయన ఆదుకున్న వారు ఎందరో ఉన్నా చప్పున గుర్తుకు వచ్చే వారిలో శోభన్ బాబు, సత్యనారాయణ వంటి మేటి నటులు, దేవిక, బి.సరోజాదేవి, కె.ఆర్.విజయ వంటి నటీమణులు ఉన్నారు. అలాగని వారు స్టార్స్ గా రాణిస్తున్న రోజుల్లో తన కోసం వారి డేట్స్ అడిగిన వారూ కారు రామారావు.
రామారావు తన సరసన నటించిన పలువురు నాయికలను ఆదుకున్నా, ముందుగా దేవిక, బి.సరోజాదేవి, కె.ఆర్.విజయ గుర్తుకు వస్తారు. దేవిక అసలు పేరు మోహన కృష్ణ. చిత్రసీమలో ప్రవేశించాక కొన్ని సినిమాల్లో అదే పేరుతో నటించారామె. తరువాత ప్రమీలాదేవిగా పేరు మార్చుకొని యన్టీఆర్ ‘రేచుక్క’ చిత్రంలో అభినయించారు. ఆ తరువాత దేవిక పేరుతో యన్టీఆర్ సరసన ‘శభాష్ రాముడు’లో నటించారు. ఆ సినిమా రజతోత్సవం చేసుకుంది. అప్పటి నుంచీ యన్టీఆర్ తోనే అధిక చిత్రాలలో నాయికగా నటిస్తూ సాగారు.
ఇక కన్నడ నాట నాయికగా రాణిస్తూ, తమిళ చిత్రాలలోనూ అలరిస్తున్న బి.సరోజాదేవిని యన్టీఆర్ తమ సొంత చిత్రం ‘పాండురంగ మహాత్మ్యం’తో తెలుగు తెరకు పరిచయం చేశారు. ఆమె కూడా యన్టీఆర్ తో అనేక చిత్రాల్లో నాయికగా నటించి మురిపించారు. ఆ పై తమిళంలో అలరిస్తున్న కె.ఆర్.విజయను తాను దర్శకత్వం వహించి, నటించిన ‘శ్రీకృష్ణ పాండవీయం’లో రుక్మిణి పాత్రలో తెలుగు వారికి పరిచయం చేశారు. ఏ ముహూర్తాన ఆయన కె.ఆర్.విజయను దేవతాపాత్రలో చూపించారో కానీ, తరువాతి రోజుల్లో దేవతల పాత్రలకు పెట్టింది పేరుగా సాగారు కె.ఆర్.విజయ. దేవుళ్ళ పాత్రలకు యన్టీఆర్ పెట్టింది పేరు కాగా, ఆయనకు తగ్గ నాయికగా కె.ఆర్.విజయ నిలిచారు. ఈమె అసలు పేరు దైవనాయకి కావడం మరో విశేషం!
ఈ ముగ్గురు నటీమణులు తారాస్థాయిలో సాగుతున్న రోజుల్లో యన్టీఆర్ సరసన నాయికలుగా నటించారు. తరువాతి రోజుల్లోనూ వారిని గుర్తు పెట్టుకొని మరీ తన సినిమాల్లో అవకాశాలు కల్పిస్తూ వచ్చారు రామారావు. ఈ ముగ్గురు నాయికలు ముద్దుగా బొద్దుగా తయారైన తరువాత వారి సరసన నటించడానికి నాటి టాప్ స్టార్స్ జంకేవారు. అయినా యన్టీఆర్ మాత్రం వారికి అవకాశాలు కల్పించారు. 1970లలోనూ యన్టీఆర్ సరసన వారిని నాయికలుగా ఎంచుకోవడం గమనార్హం! అలా దేవిక యన్టీఆర్ తో “రాజకోట రహస్యం, చిన్ననాటి స్నేహితులు”లో నాయికగా నటించారు. ఇక యన్టీఆర్ సరసన బి.సరోజాదేవి “విజయం మనదే, మాయని మమత, మనుషుల్లో దేవుడు, శ్రీరామాంజనేయ యుద్ధం” సినిమాల్లో హీరోయిన్ గా కనిపించారు. కె.ఆర్.విజయతో ‘లక్ష్మీకటాక్షం’లోనూ హీరోగా నటించారు యన్టీఆర్.
ఆ తరువాత కూడా తన చిత్రాలలో ఎక్కడ అవకాశం ఉన్నా ఈ ముగ్గురికే అవకాశాలు కల్పించారు యన్టీఆర్. తాను హీరోగా నటించిన “పల్లెటూరి చిన్నోడు, నిప్పులాంటి మనిషి” చిత్రాలలో దేవికకు తన వదినగా నటించే ఛాన్స్ ఇప్పించారు. తాను స్వీయ దర్శకత్వంలో నటించి, తెరకెక్కించిన “దానవీరశూర కర్ణ, సమ్రాట్ అశోక” చిత్రాలలోనూ బి.సరోజాదేవికి తగిన పాత్రలు ఇచ్చారు. ఇక ‘మేలుకొలుపు, ప్రేమసింహాసనం’ వంటి చిత్రాలలో కె.ఆర్.విజయకు ప్రత్యేక పాత్రలు లభించేలా చేశారు. అందువల్లే ఈ ముగ్గురు నాయికలతో యన్టీఆర్ అనుబంధానికి ఆ రోజుల్లో కొందరు వక్రభాష్యం చెప్పినా, ఆయన మాత్రం వీరికి అవకాశాలు కల్పించడం విశేషం!