బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ ఇంట్లో చోరీ జరిగిన విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. కోట్ల విలువైన నగలను దుండగులు ఎత్తుకెళ్లినట్లు సమాచారం. ఫిబ్రవరి 23 న ఈ ఘటన జరగగా హై ప్రొఫైల్ కేసు కావడంతో పోలీసులు గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది. అయితే తాజాగా సోనమ్ ఇంట్లో పనిచేసేవారి ద్వారా ఈ విషయం బయటపడినట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలో ఒక ఖరీదైన ప్లాట్ లో సోనమ్ కపూర్, ఆమె భర్త ఆనంద్ అహుజా, అతని తల్లితండ్రులుతో కలిసి నివసిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే దొంగతనం అనంతరం ఒక రోజు అల్మారాలోని నగలు, డబ్బు తనిఖీ చేసినప్పుడు కొన్ని నగలు, కొంత డబ్బు కనపడకుండా పోయేసరికి వారికి ఇంట్లో చోరీ జరిగిందని అర్ధమయ్యి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వెంటనే పోలీసులు సోనమ్ ఇంటికి చేరుకొని పరిశీలించి సుమారు రూ.1.41 కోట్ల విలువైన నగలు, డబ్బును ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. అనంతరం కేసు నమోదు చేసుకొన్నా పోలీసులు సోనమ్ ఇంట్లో పనిచేస్తున్న 25మంది ఉద్యోగులతో పాటు 9మంది కేర్‌టేకర్స్,డ్రైవర్లు, తోటమాలి, ఇతర పనివాళ్లను అదుపులోకి తీసుకున్న విచారిస్తున్నారు. ఇప్పటికే సీసీటీవీ ఫుటేజ్ ని కూడా పరిశీలించారట. ఇదంతా ఎవరో తెలిసినవారే చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక ప్రస్తుతం సోనమ్ కపూర్ గర్భవతి కావడంతో పుట్టింట్లో ఉంటుంది. ఈ వార్త ప్రస్తుతం బాలీవుడ్ లో కలకలం రేపుతోంది.