మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెల్సిందే. క్షణం తీరిక లేకుండా కుర్ర హీరోలకు ధీటుగా మూడు సినిమాలను ఒకేసారి కానిచ్చేస్తున్నాడు. ఇక ప్రస్తుతం చిరు నటిస్తున్న సినిమాల్లో బాబీ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఒకటి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక నేడు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ సినిమాలోని హీరోయిన్ ని పరిచయం చేశారు మేకర్స్.
మొదటి నుంచి అనుకున్నట్లే ఈ చిత్రంలో చిరు సరసన శృతి హాసన్ నటిస్తుంది. ఈ విషయాన్నీ మేకర్స్ తెలుపుతూ ” మహిళా దినోత్సవం రోజున ఇంతకంటే మంచి వార్త ఏం ఉంటుంది.. వెల్ కమ్ శృతి అంటూ చిత్ర బృందం శృతిని సాదరంగా ఆహ్వానించింది” ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. క్రాక్ చిత్రంతో హిట్ ట్రాక్ ఎక్కిన ఈ భామ స్టార్ హీరోల సరసన అవకాశాలను అందుకుంటుంది. ఇప్పటికే సలార్ లో ప్రభాస్ సరసన.. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ సరసన నటిస్తుంది. ఇక ఇప్పుడు మెగా ఆఫర్ పట్టేసి మిగతా హీరోయిన్లకు పోటీగా దిగింది. మరి అమ్మడు ఈ సినిమాలతో ఎలాంటి విజయాలను అందుకుంటుందో చూడాలి.