కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. తమిళ్ బిగ్ బాస్ రియాలిటీ షో హోస్ట్ నుండి వైదొలగుతున్నట్లు కమల్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. తమిళ్ బిగ్ బాస్ సీజన్ 1 నుంచి ఇప్పటివరకు కమల్ మాత్రమే హోస్ట్ చేస్తూ వచ్చారు. ఇక తాజాగా ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక కారణం ఏంటి అనేది తెలిపారు. ప్రస్తుతం కమల్ ‘విక్రమ్’ సినిమాలో నటిస్తున్నారు. రాజశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకోంటుంది. అయితే ఎప్పుడో ఈ సినిమా పూర్తి కావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదాల మీద వాయిదా పడుతూ వస్తుంది.
ఇక మధ్యలో కమల్ బిగ్ బాస్ షో వలన డేట్స్ సరిపోవడం లేదని తెలుస్తోంది. దీనికోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కమల్ తెలిపారు. ”లాక్ డౌన్ పరిమితుల కారణంగా మేము విక్రమ్ కోసం నిర్మాణ కార్యకలాపాలను రీషెడ్యూల్ చేయవలసి వచ్చింది. తద్వారా అనివార్యంగా బిగ్ బాస్ కోసం కేటాయించాల్సిన తేదీలు విక్రమ్ సినిమా కోసం కేటాయించాల్సి వచ్చింది. ప్రముఖ తారలు మరియు సాంకేతిక నిపుణుల కలయికలో వచ్చే సన్నివేశాలను పూర్తి చేయడానికి మరికొన్ని రోజుల విక్రమ్ షూటింగ్ మిగిలి వుంది. వాస్తవాన్ని పరిగణనలోకి తీసుకొని విక్రమ్ మరియు బిగ్ బాస్ రెండింటినీ కలిపి నిర్వహించడం ఆచరణాత్మకంగా అసాధ్యం. ప్రముఖ తారలు మరియు సాంకేతిక నిపుణులను నా కోసం వేచి ఉండేలా చేయడం అన్యాయం. తత్ఫలితంగా, నేను ఇప్పుడు బిగ్ బాస్ ఈ సీజన్ నుండి వైదొలగవలసి వచ్చింది”.