ప్రముఖ నటుడు జగపతిబాబుకు మరో సంవత్సరం గడిస్తే షష్టి పూర్తి! అయితే… తన 59 సంవత్సరాల జీవితాన్ని ఇప్పుడాయన పునశ్చరణ చేసుకోబోతున్నారు. ‘సముద్రం – ఇట్స్ మై లైఫ్’ పేరుతో జూన్ 18 సాయంత్రం 6 గంటలకు తన జీవిత విశేషాలకు సంబంధించిన కార్యక్రమం చూడొచ్చని జగపతిబాబు చెబుతున్నారు. దీనికి సంబంధించి చిన్న వీడియోను జగపతిబాబు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రముఖ దర్శక నిర్మాత వి.బి. రాజేంద్ర ప్రసాద్ తనయుడిగా చిత్రసీమలోకి అడుగుపెట్టిన జగపతిబాబు కెరీర్ ప్రారంభంలోనే ఎన్నో ఎత్తుపల్లాలను చూశారు. కథానాయకుడిగా తనదైన ముద్రను తెలుగుతెరపై వేసి, ఇప్పుడు విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు భాషల్లో నటిస్తున్నారు. హీరోగా అందుకున్న పారితోషికానికి మించి జగపతిబాబు ఇప్పుడు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. 35 సంవత్సరాల తన నటజీవితానికి సంబంధించిన విశేషాలను జగపతి బాబు ‘సముద్రం’ అనే డాక్యుడ్రామాలో చెప్పబోతున్నారు.
‘సముద్రం’ పేరుతో రూపుదిద్దుకుంటున్న ఈ కార్యక్రమంలో పేరుకు తగ్గట్టుగానే జగ్గుభాయ్ ఓ డీప్ డైవ్ చేసి ఆనాటి రోజులను మన ముందు ఆవిష్కరించబోతున్నారు. ఇందులో వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విశేషాలతో పాటు తాత్త్విక భూమిక కూడా ఉంటుంది. అలానే నటుడుగా ఆయన పొందిన విజయాలతో పాటు పరాజయాలను, ఎదుర్కొన్న వివాదాలను, బలహీనతలను జగపతిబాబు చెప్పబోతున్నారు. విశేషం ఏమంటే… జగపతి బాబు గతంలో కృష్ణవంశీ దర్శకత్వంలో ‘సముద్రం’ పేరుతో ఓ సినిమాలోనూ నటించారు. ఆయన ఈ ప్రకటన చేయగానే… అభిమానులంతా హర్షం వ్యక్తం చేశారు. ఏ విషయం గురించి అయినా నిక్కచ్చిగా, ముక్కుసూటిగా మాట్లాడే జగపతిబాబు మనసు నుండి ఎలాంటి మాటలు వింటామా అని ఆసక్తిగా అందరూ ఎదురుచూస్తున్నారు.