Kartikeya: కార్తికేయ గుమ్మకొండ నటిస్తున్న తాజా చిత్రం ‘బెదురులంక 2012’. రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మిస్తున్న ఈ సినిమాతో క్లాక్స్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కార్తికేయ సరసన ‘డీజే టిల్లు’ ఫేమ్ నేహాశెట్టి నాయికగా నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన రొమాంటిక్ సాంగ్ ఒకటి తాజాగా విడుదలైంది. అంతేకాదు… సోషల్ మీడియాలో వేడి సెగలు కూడా రేపుతోంది. ‘వెన్నెల్లో ఆడపిల్ల… కవ్వించే కన్నెపిల్ల… కోపంలో చూస్తే ఎల్లా… క్షణంలో అగ్గిపుల్ల…’ అంటూ సాగే ఈ గీతాన్ని కిట్టు విస్సాప్రగడ రాయగా, మెలోడీ బ్రహ్మ మణిశర్మ అద్బుతమైన బాణీ సమకూర్చారు. దీన్ని హారిక నారాయణ్, జె.వి. సుధాంశు ఆలపించారు. లెజెండరీ కొరియోగ్రాఫర్ బృందా మాస్టర్ దీనికి నృత్య దర్శకత్వం వహించారు.

ఈ పాట విడుదల సందర్భంగా నిర్మాత బెన్నీ ముప్పానేని మాట్లాడుతూ, “ఈ ప్రేమకథలోని కీలకమైన సందర్భంలో వస్తుందీ పాట. మణిశర్మ గారి బాణీకి తోడు కార్తికేయ, నేహా శెట్టి మధ్య కెమిస్ట్రీ, కెమెరా వర్క్ పాటలో హైలైట్ అవుతాయి. ఈ పాట విడుదలైన కొన్ని క్షణాల్లోనే ఫెంటాస్టిక్ రెస్పాన్స్ వచ్చింది. గోదావరి తీర ప్రాంతంలోని ఓ గ్రామంలో ఈ పాటను చిత్రీకరించాం. ఎనిమిది ఎకరాల రొయ్యల చెరువు మధ్య రాత్రి వేళల్లో తీసిన పాట ఇది. సినిమాలో హీరో హీరోయిన్ల జోడి చాలా ఫ్రెష్ గా ఉంటుంది. వాళ్ళిద్దరి రొమాన్స్ సినిమాకి హైలైట్. అలాగే, కామెడీ కూడా! ఎంటర్టైనర్ ఆఫ్ థిస్ సీజన్ అని మేం గర్వంగా చెప్పగలం. ఇప్పటివరకు గోదావరి నేపథ్యంలో వచ్చిన రూరల్ డ్రామాలకు చాలా భిన్నంగా ఉంటుందీ సినిమా. గోదావరి బేస్డ్ రూరల్ డ్రామాలకు ‘బెదురులంక 2012’ ఒక బెంచ్ మార్క్ సెట్ చేస్తుంది. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు వినోదాత్మకంగా, వైవిధ్యంగా ఉన్నాయని ప్రేక్షకులు చెబుతున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు చివరి దశలో ఉన్నాయి. త్వరలో విడుదల తేదీ వెల్లడిస్తాం. డిస్ట్రిబ్యూషన్ సర్కిల్స్ నుంచి మంచి ఆఫర్లు వస్తున్నాయి. బిజినెస్ క్రేజీగా జరుగుతోంది” అని చెప్పారు.