ఆ మధ్య వచ్చిన యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ ‘హుషారు’ చక్కని విజయాన్ని అందుకుంది. అందుకే కావచ్చు ఇప్పుడు నిర్మాత పి.ఎస్.ఆర్. కుమార్ (వైజాగ్ బాబ్జీ) తన చిత్రానికి ‘షికారు’ అనే పేరు పెట్టారు. ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ లో సాయిధన్సిక, తేజ్ కూరపాటి, అభినవ్ మేడిశెట్టి, ధీరజ్, నవకాంత్ ప్రధాన పాత్రలు పోషించారు. దర్శకుడు హరి కొలగాని ఈ చిత్రానికి కథ, చిత్రానువాదం అందించారు. శేఖర్ చంద్ర సంగీతం సమకూర్చారు. ఇటీవల ఈ సినిమాలోని మొదటి పాట విడుదలైంది. తాజాగా సెకండ్ సింగిల్ ను ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు ఆవిష్కరించారు. ఆయన కార్యాలయంలో ‘ఫ్రెండే తోడుండగా…’ అనే పాటను దిల్ రాజు రిలీజ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ”మా బాబ్జీ నిర్మాతగా, కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ, కొత్తవారితో ‘షికారు’ మూవీ పూర్తి చేశాడు. ఇందులో నటించిన తేజ్ మా `రౌడీ బాయ్స్`లో నటించాడు. అప్పుడే ఈ సినిమా గురించి చెబుతుండేవాడు. బాగా వచ్చిందనేవాడు. ముందుగా ఓ సాంగ్‌ను విడుదల చేశారు. జనాల్లో బాగా రీచ్ అయింది. ఈ రోజు ‘ప్రెండే తోడుగా వుండగా లైఫే పండుగ… ‘ అనే పాటను విడుదల చేశాను. ఫ్రెండ్‌షిప్‌లోని మాధుర్యాన్ని బాగా చూపించారు. ఇది యూత్‌కు బాగా రీచ్ అవుతుందనే నమ్ముతున్నాను” అని అన్నారు.
నిర్మాత బాబ్జీ మాట్లాడుతూ, ”ఎంతో బిజీగా వుండి కూడా మా ‘షికారు’ సినిమాలోని రెండో పాటను ‘దిల్’ రాజు గారు ఆవిష్కరించడం ఆనందంగా వుంది. అన్ని కార్యక్రమాలు ముగించుకుని `షికారు` చిత్రాన్ని జూన్ 24న విడుదల చేయబోతున్నాం” అని చెప్పారు. కన్నడ కిషోర్, పోసాని కృష్ణ మురళి, గాయత్రి రెడ్డి (‘విజిల్’ ఫేమ్ ), చమ్మక్ చంద్ర, అన్నపూర్ణమ్మ, సురేఖా వాణి తదితరులు ఈ చిత్రంలో ఇతర ప్రధాన పాత్రలు పోషించారు.