(డిసెంబర్ 2న సిల్క్ స్మిత జయంతి)
‘సిల్క్’… ఈ పేరు వినగానే ఆ రోజుల్లో కుర్రాళ్ళ నరాలు జివ్వుమనేవి. ఇక సిల్క్ స్మితను తెరపై చూడగానే వారి మనసులు విహంగాలై తేలిపోయేవి. సిల్క్ స్మితను శృంగార రసాధిదేవతగా కొలిచిన వారెందరో ఉన్నారు. సిల్క్ స్మిత నర్తనంలో పట్టు కనిపించక పోయినా, ఆమె సౌష్టవం గుట్టుగా జనం మదిని కొల్లగొట్టేది. అది తెలిసిన సినీజనం సిల్క్ సింగారానికి ఎర్రతివాచీ పరిచారు. సిల్క్ స్మిత ఆటకు జనం జేజేలు కొట్టారు.
సిల్క్ స్మిత అసలు పేరు వడ్లపట్ల విజయలక్ష్మి. 1960 డిసెంబర్ 2న ఏలూరు తాలూకా దెందులూరు మండలం కొవ్వలిలో విజయలక్ష్మి జన్మించారు. నాల్గవ తరగతి దాకా చదువుకున్న విజయలక్ష్మి, ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు మానేసింది. పదిహేనేళ్ళకే పెళ్ళి చేసేశారు. ఆమె భర్త, అత్తమామలు వేధిస్తూ ఉండడంతో ఇల్లు వదలి పారిపోయారు. మదరాసు చేరి, తొలుత టచప్ ఆర్టిస్ట్ గా పనిచేశారు స్మిత. కొంతమంది హీరయిన్లకు టచప్ చేస్తున్న సమయంలోనే బిట్ రోల్స్ లో నటించే అవకాశం దక్కింది. మళయాళ దర్శకుడు ఆంథోనీ ఈస్ట్ మన్ దర్శకత్వం వహించిన ‘ఇనయె తేడీ’ చిత్రంలో స్మితకు తొలిసారి నాయిక పాత్ర లభించింది. ఈ సినిమాకు ముందు తమిళంలో ‘వండిచక్రం’ అనే చిత్రంలో స్మిత కీలక పాత్ర పోషించారు. ఈ రెండు చిత్రాలలో తమిళ, మళయాళ చిత్రసీమల్లో స్మితకు మంచి గుర్తింపు లభించింది. ‘వండి చక్రం’ తెలుగులో ‘ఘరానా గంగులు’గా రీమేక్ కాగా, అందులో స్మిత నటించి, తెలుగు తెరకు పరిచయం అయ్యారు. మాతృభాష తెలుగులో స్మితకు వచ్చీ రాగానే మంచి అవకాశాలు లభించాయి. ‘సీతాకోకచిలుక’లో శరత్ బాబు భార్యగా నటించారు. ‘రోషగాడు’లో సిఐడీ పాత్రలో కనిపించారు. యన్టీఆర్ ‘నా దేశం’ చిత్రంలో “నేనొక నెత్తురు దీపం…” సాంగ్ లో నర్తించారు స్మిత. ఆ తరువాత నుంచీ ఐటమ్ గాళ్ గా ఆమె సాగిపోయారు. అప్పటి టాప్ హీరోస్ అందరి చిత్రాలలోనూ సిల్క్ స్మిత డాన్సులు భలేగా కనువిందు చేశాయి.
ఐటమ్ గాళ్ గా సాగుతున్నా, సిల్క్ స్మిత తనకంటూ ఓ ప్రత్యేక వ్యక్తిత్వాన్ని ఏర్పరచుకున్నారు. ఆమె ప్రధాన నాయికగా ‘మాయలేడి’ అనే చిత్రం రూపొంది జనాన్ని ఆకట్టుకుంది. ఇక ‘బావ-బావమరిది’లో వ్యాంప్ గా సిల్క్ అభినయం భలేగా అలరించింది. ‘లేడీ జేమ్స్ బాండ్’లోనూ, చిరంజీవి ‘గూండా, ఛాలెంజ్’, బాలకృష్ణ ‘ఆదిత్య 369’ చిత్రాలలోనూ కీలక పాత్రల్లో కనిపించారు సిల్క్ స్మిత. తన దరికి చేరిన ఐటమ్ సాంగ్స్ లోనూ, తగిన పాత్రల్లోనూ స్మిత ఆకట్టుకున్నారు. మాతృభాష తెలుగుతో పాటు తమిళ, మళయాళ, కన్నడ చిత్రాలలోనూ సిల్క్ స్మిత తనదైన బాణీ పలికించారు. సిల్క్ ఐటమ్ సాంగ్ ఆ రోజుల్లో ఓ పేయింగ్ ఎలిమెంట్ గా ఉండేది. సిల్క్ కంటే ముందు జ్యోతిలక్ష్మి, ఆమె సోదరి జయమాలిని తెలుగు చిత్రసీమలో ఐటమ్ గాళ్స్ గా రాజ్యమేలారు. తరువాతి రోజుల్లో సిల్క్ స్మిత, అనురాధ తమ బాణీ పలికించారు. స్మిత, అనురాధ ఇద్దరూ తెలుగువారే కావడంతో వారిద్దరి మధ్య మంచి స్నేహం ఉండేది.
మత్తు కళ్ళతో చూపరులను చిత్తు చేసిన సిల్క్ స్మిత నిజజీవితంలో పసిపిల్ల మనస్తత్వం కలిగి ఉండేవారు. 1996లో ఎవరితోనూ అంతగా కలుసుకోవడానికి ఇష్టపడేవారు కారు. అవకాశాలు లభిస్తే నటించడం, లేదంటే ఇంట్లోనే ఉండడం చేసేవారు. 1996 సెప్టెంబర్ 23న సిల్క్ స్మిత ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె మరణంపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఏది ఏమైనా ప్రేక్షకుల మదిలో శృంగార రసాధిదేవతగా నిలచిన సిల్క్ స్మిత అర్ధాంతరంగా తనువు చాలించడం అభిమానులకు బాధ కలిగించింది. ఆమె నర్తించిన, నటించిన చిత్రాలను చూస్తూ అభిమానులు ఆ బాధను మరచిపోగలిగారు. సిల్క్ స్మిత జీవితంలోని ముఖ్య ఘట్టాలు సినిమాకు పనికి వస్తాయని బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్ భావించారు. సిల్క్ జీవితం ఆధారంగానే ఏక్తాకపూర్ ‘ద డర్టీ పిక్చర్’ నిర్మించారు. పదేళ్ల క్రితం సిల్క్ 51వ జయంతి సందర్భంగా ఈ చిత్రాన్ని డిసెంబర్ 2న విడుదల చేశారు. సిల్క్ పేరు మీద కోట్ల రూపాయలు సంపాదించారు. ఏది ఏమైనా సిల్క్ స్మిత తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకొని జనం మదిలో నిలచిపోయారు.