తెలుగు సినిమా హాస్యానికి రేలంగి మకుటంలేని మహారాజు. తెలుగు చిత్రసీమలో నవ్వుల పర్వాన్ని రేలంగికి ముందు, రేలంగికి తరువాత అని విభజించవలసి ఉంటుంది. తెలుగు సినిమా స్వర్ణయుగం మొదలు, తెలుగు చిత్రాల్లో విలువలు కరగిపోవడం మొదలైన దాకా రేలంగి నవ్వులు పంచారు. అందువల్ల రేలంగి ముందు, తరువాత అనడం సబబు. అంతకు ముందు కొందరు నవ్వుల పేరిట వెకిలి వేషాలు వేస్తూ సాగారు. కొందరయితే, ఆ రోజుల్లోనే ద్వంద్వార్థాలు తీస్తూ అదే హాస్యం అని చాటారు. అయితే రేలంగి అడుగుపెట్టిన తరువాత హాస్యం అంటే ఎంతటి కత్తిమీద సామో అందరికీ తెలిసి వచ్చేలాచేశారు. తాను నవ్వకుండానే ప్రేక్షకుల పొట్టలు చెక్కలు చేసేవారు రేలంగి. తెలుగునాట హాస్యానికి తొలి ‘పద్మం’ సంపాదించిన ఘనత కూడా ఆయనదే! తెలుగు చిత్రసీమ నవ్వుల వనంలో రేలంగి ఓ వాడని పువ్వు అంటే అతిశయోక్తి కాదు.
తూర్పు గోదావరి జిల్లా రావుల పాలెంలో 1910 ఆగస్టు 9న జన్మించిన రేలంగి వెంకట్రామయ్య బాల్యంలోనే శ్రావ్యంగా పాడుతూ ఉండేవారు. ఆయన గొంతు విన్న పెద్దలు సంగీత సాధన కూడా చేయమన్నారు. హరికథలు చెప్పడంలో ప్రావీణ్యం సంపాదించారు. అలాగే హార్మోనియం వాయించడంలోనూ దిట్ట అనిపించారు. ఆ రోజుల్లో నాటకాల్లో నటించడానికి రూపంతో పాటు, గాత్రం, కాసింత సంగీతజ్ఞానం కూడా ఎంతో అవసరం. రేలంగికి అవి పుష్కలంగా ఉండడంతో ఇట్టే నాటకరంగంలో దిట్టగా నిలిచారు. 1935లో సి.పుల్లయ్య తెరకెక్కించిన ‘శ్రీకృష్ణతులాభారం’లో శ్రీకృష్ణుని చెలికాడు వసంతయ్యగా నటించి నవ్వులు పూయించారు. సి.పుల్లయ్య చిత్రాలలో నటిస్తూనే ఆయన సినిమాలకు ప్రొడక్షన్ మేనేజర్ గా ఉన్నారు రేలంగి. పుల్లయ్య దర్శకత్వంలో రూపొందిన ‘గొల్లభామ’ ఆ రోజుల్లో మంచి విజయం సాధించింది. ఇందులో రేలంగి పాత్ర జనం మన్ననలు పొందింది. ఇక రేలంగి మరి వెనుతిరిగి చూసుకోకుండా నటనలోనే సాగిపోయారు. సొంతగా పాడుతూ, తనదైన అభినయంతో ఆకట్టుకుంటూ సాగారు రేలంగి. ‘పాతాళభైరవి’లో రాజుగారి బావమరిది ధీరశూరసేనునిగా రేలంగి అభినయంతో గిలిగింతలకు గురికానివారు ఉండరు. సి.పుల్లయ్యకు రేలంగి అంటే వాత్సల్యం. అందువల్ల తన చిత్రాలలో కీలక పాత్రలు అందిస్తూ ఉండేవారు. రేలంగి సైతం వాటిలో పరకాయ ప్రవేశం చేసి మురిపించేవారు. 1953లో రేలంగిని హీరోగా పెట్టి ‘పక్కయింటి అమ్మాయి’ అనే చిత్రాన్ని రూపొందించారు పుల్లయ్య. అంజలీదేవి నాయికగా నటించిన ఈ చిత్రం అప్పట్లో నవ్వులు పూయిస్తూ మంచి విజయం అందుకుంది.
‘గుణసుందరి కథ’లోని కాలమతి, ‘మనదేశం’లోని పోలీస్ వెంకటస్వామి, ‘పాతాళభైరవి’లోని రాజుగారి బామ్మర్ది, ‘రాజు-పేద’లోని సుధీర్, ‘మిస్సమ్మ’లోని దేవయ్య, ‘రోజులు మారాయి’లోని పోలయ్య, ‘మాయాబజార్’లోని లక్ష్మణ కుమారుడు, ‘అప్పుచేసి పప్పుకూడు’లోని భజగోవిందం, ‘జగదేకవీరుని కథ’లోని రెండుచింతలు, ‘లవకుశ’లోని తిప్పడు, ‘నర్తనశాల’లోని ఉత్తరకుమారుడు – వంటి పాత్రల్లో రేలంగి అభినయం చూసిన తరువాత మరొకరిని ఊహించుకోలేం. రేలంగి నిర్మాతగా మారి 1960లో ‘సమాజం’ అనే చిత్రం నిర్మించారు. అది ఆట్టే విజయం సాధించలేకపోయింది. తాడేపల్లి గూడెంలో రేలంగి థియేటర్ ను నిర్మించారు. 1970లో రేలంగికి పద్మశ్రీ పురస్కారం లభించింది. చివరి దాకా రేలంగి నవ్వుల పువ్వులు పూయిస్తూనే సాగారు. నవతరం సైతం రేలంగి హాస్యాభినయం చూసి మురిసిపోతోంది.