అడుసు తొక్కనేల… కాలు కడగనేల…! అన్నట్టుందట ఆ కాంగ్రెస్ సీనియర్ లీడర్ వ్యవహారం. పార్టీలో స్వేచ్ఛ ఎక్కువనుకుంటూ నోటికి పనిచెబితే… ఇప్పుడు నాలుక మడతేయాల్సి వచ్చిందని మాట్లాడుకుంటున్నారు. ఎదుటి పక్షం కూడా రివర్స్ అటాక్ మొదలుపెట్టడంతో…. ఆయన వెనక్కి తగ్గాల్సి వచ్చిందట. ఇంతకీ ఎవరా సీనియర్ లీడర్? ఏంటా రివర్స్ సీన్? వెనకా… ముందూ… ఆలోచించకుండా నోటికి ఏదివస్తే అది అనేయడం, ఆనక తేడా కొడితే నాలుక మడతేయడం తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు అలవాటైపోయిందన్న అభిప్రాయం పెరుగుతోందట రాజకీయవర్గాల్లో. వీళ్ళు ఎప్పుడెప్పుడు దొరుకుతారా అని ఓ వైపు ప్రతిపక్షం కాచుకు కూర్చుంటే… ఆ సోయి లేకుండా… అధికార పార్టీ నేతలు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నట్టు చెప్పుకుంటున్నారు. సాధారణంగా కాంగ్రెస్‌లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ కాబట్టి… సొంత పార్టీ నేతల మీద కూడా…విచ్చలవిడి విమర్శలు చేయడం, ఘాటు కామెంట్స్ నడుస్తూనే ఉంటాయి. కానీ… రానురాను అది శృతిమించుతోందన్న అభిప్రాయం పార్టీలోనే పెరుగుతోందట. ప్రత్యేకించి కులాల ప్రస్తావన తెచ్చి…ఇష్టం వచ్చిన కామెంట్స్ చేయడం ద్వారా… సొంత పార్టీలోనే కుంపటి పెడుతున్నది ఇప్పుడు కాంగ్రెస్‌లో ఓపెన్ టాక్. బీసీలకు రాజ్యాధికారం, జనాభా దామాషా ప్రకారం పదవుల్లో వాటా ఇవ్వాలన్న డిమాండ్‌లో ఎక్కడా రాజీ పడాల్సిన, అస్సలు తగ్గాల్సిన అవసరం లేదుగానీ… అంజన్‌కుమార్ యాదవ్ లాంటి నాయకులు అసలు విషయాన్ని వదిలేసి కులాల పేరుతో అగ్గి రాజేస్తే… అంతిమంగా నష్టపోయేది సొంత పార్టీయేకదా? ఇది కూర్చున్న కొమ్మను నరుక్కోవడం కాదా అన్న సీరియస్ చర్చ జరుగుతోందట తెలంగాణ కాంగ్రెస్‌లో.
అంజన్ కుమార్ యాదవ్‌తో పాటు మరో ఎమ్మెల్సీ కూడా ఒక కులాన్ని టార్గెట్ చేస్తూ తిట్టడంవల్ల పార్టీకి వచ్చే లాభం కంటే… జరిగే నష్టమే ఎక్కువన్న అభిప్రాయం వ్యక్తం అవుతోందట. తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో రెడ్ల ఆధిపత్యం ఎక్కువ. క్రియాశీలక పాత్ర కూడా ఆ సామాజికవర్గానిదే. అలాంటి రెడ్డి సామాజిక వర్గం నేతల్ని టార్గెట్ చేస్తే…వచ్చే లాభం ఏంటని ప్రశ్నించుకుంటున్న పరిస్థితి. పార్టీతో కలిసి ఉన్న వర్గాలను దూరం చేసుకోవడం సరికాదన్న వాదన బలపడుతోంది. ఇప్పటికే పార్టీ ఎమ్మెల్సీ చేసిన వ్యాఖ్యల బురద కడుక్కోవడానికే నానా తంటాలు పడుతుంటే…. కొత్తగా అంజన్‌కుమార్ అదే సమస్యను కెలికి వదిలేశారని, దీని పర్యవసానాలు ఎలా ఉంటాయోనని కాంగ్రెస్ నేతలు మాట్లాడుకుంటున్నట్టు తెలిసింది. అంజన్ కుమార్ యాదవ్ కామెంట్స్ పై రియాక్ట్ అయ్యారు జగ్గారెడ్డి. ఆ విషయంలో రెడ్డి సామాజిక వర్గం తొందర పడొద్దని ఓవైపు అంటూనే… అంజన్‌ను సుతి మెత్తగా హెచ్చరించారట జగ్గారెడ్డి. దీంతో ఆయన చేసిన సూచనకంటే రియాక్షన్ తీవ్రత ఎక్కువగా ఉందని మాట్లాడుకుంటున్నారట. పార్టీలో బీసీ నేతల వ్యాఖ్యల తర్వాత రాజకీయ ఎత్తుగడ కంటే…వాళ్ళ సొంత అజెండాలే ఎక్కువయ్యాయన్న చర్చ కూడా తెర మీదకు వచ్చింది. సొంత పార్టీ నేతలే తిట్టడం అంటే… అది కాంగ్రెస్ అంతర్గత లొల్లికి కారణం కాబోతోందన్న హెచ్చరికలు కూడా వస్తున్నాయట. అంజన్ కుమార్ యాదవ్ ముందు రోజు కామెంట్ చేశారు… మరుసటి రోజు సరిదిద్దుకున్నారు. కానీ…ఆయన వెనక ఎవరున్నారన్నది ఇప్పుడు కాంగ్రెస్‌లో జరుగుతున్న హాట్ హాట్ చర్చ. ప్రశాంతంగా ఉన్న పార్టీలో ఈ వ్యవహారం అగ్గి రాజేస్తోందన్న మాటలు సైతం వినిపిస్తున్నాయి. ఈ కథలో ఎన్ని మలుపులు ఉంటాయో చూడాలి మరి.