వైసీపీ వ్యూహం మారిందా? ఇక మీదట మేటర్ ఏదైనాసరే… పెద్దల సభలోనే తేల్చుకోవాలని డిసైడయ్యిందా? ఆ దిశగా ఆల్రెడీ ట్రయల్ రన్ సక్సెస్ అయిందన్న ఫీలింగ్ పార్టీ పెద్దల్లో ఉందా? అసెంబ్లీని వదిలేసినా… తమకు బలం ఉన్న చోట అధికార పక్షాన్ని చెడుగుడు ఆడేసుకోవాలని ఫ్యాన్ పార్టీ ముఖ్యులు నిర్ణయించారా? ఇంతకీ వైసీపీ మారిన వ్యూహం ఏంటి? అమలు ఎలా ఉండబోతోంది? ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రస్తుతం ప్రతిపక్ష హోదా యుద్ధం నడుస్తోంది. గత ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమైంది వైసీపీ. ఆ బలానికి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడం కుదరదని అధికార కూటమి, సభలో కూటమి పార్టీలు, తాము తప్ప వేరే ఎవరూ లేనందున మాకు హోదా కావాల్సిందేనని వైసీపీ పట్టుబడుతుండటంతో… పొలిటికల్ హీట్ పెరిగిపోతోంది. మాటల యుద్ధం ముదిరి మేటర్ కోర్ట్‌దాకా వెళ్ళింది. హోదా కోసం వైసీపీ.. కోర్టుకు వెళ్ళగా… అసెంబ్లీ స్పీకర్ ఇంకా రిప్లయ్ ఇవ్వాల్సి ఉంది. దీంతో ఆ వ్యవహారం అక్కడే ఆగిపోయింది. ఇక తాజాగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో.. మరోసారి ప్రతిపక్ష హోదా అంశం తెరమీదకు వచ్చింది. తొలిరోజు గవర్నర్ ప్రసంగం సందర్భంగా… అసెంబ్లీకి హాజరయ్యారు వైసీపీ అధినేత జగన్, పార్టీ ఎమ్మెల్యేలు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తుండగానే… ప్రతిపక్ష హోదా ఇవ్వండి.. ప్రజల గొంతు వినిపించేందుకు అవకాశం ఇవ్వండి అంటూ నినాదాలు చేశారు వైసీపీ సభ్యులు.. ఆ తర్వాత పోడియం వద్దకు దూసుకెళ్లడం.. కాసేపు నిరసన తెలిపాక గవర్నర్ ప్రసంగాన్ని బాయ్‌కాట్ చేయడం జరిగిపోయాయి. ఇక ప్రతిపక్ష హోదా అంశం తేల్చే వరకూ అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండాలని నిర్ణయించింది వైసీపీ. అయితే… దాన్ని అసెంబ్లీ వరకే పరిమితం చేయాలని, తమకు బలం ఉన్న శాసనమండలిలో మాత్రం అధికార పక్షాన్ని ఇరకాటంలో పెట్టేందుకు వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోకూడదని గట్టిగా ఫిక్స్ అయ్యిందట వైసీపీ అధినాయకత్వం.
మండలికి హాజరైన వైసీపీ సభ్యులు గవర్నర్ ప్రసంగంపై చర్చ సందర్భంగా గట్టిగానే రియాక్ట్ అయ్యారన్న అభిప్రాయం ఉంది. గవర్నర్‌తో అబద్ధాలు పలికించారని ఆరోపించిన వైసీపీ సభ్యులు.. 4 లక్షల ఉద్యోగాలిచ్చినట్టు చెప్పారని, అవెక్కడంటూ నిలదీశారు. అందుకు స్పందించిన మంత్రి లోకేష్… ఉద్యోగ అవకాశాలు కల్పించామనే చెప్పాంగానీ… నియమించామని చెప్పలేదన్నారు. వైసీపీ సభ్యులు వాస్తవాలు మాట్లాడాలని, వాకౌట్ చేయొద్దు.. అన్నింటిపైనా చర్చిద్దామని సవాల్ చేశారాయన. అయితే, గవర్నర్ ప్రసంగం తెలుగు అనువాదంలో తేడా ఉంది.. తప్పుంటే మార్చుకుంటామని చెప్పండని సూచించారు మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ. ఇక రాష్ట్రంలో పలు యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ల నియామకాలపై కూడా మండలిలో వాడి వేడి చర్చ జరిగింది.గతంలో ఎప్పుడూ లేని విధంగా వీసీలపై కూడా ఒత్తిడి తెచ్చి రాజీనామాలు చేయించారంటూ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీశారు వైసీపీ సభ్యులు. దీనిపై ఇరుపక్షాల మధ్య గట్టిగానే వాదనలు నడిచాయి. ఇలా… మొత్తంగా ఏపీ శాసనమండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు వర్సెస్ మంత్రి లోకేష్‌గా మారింది వాతావరణం. ఇక పెద్దల సభలో విపక్ష నేతగా బొత్స సత్యనారాయణ పాయింట్ టు పాయింట్ మాట్లాడుతూ తమ పార్టీకి మైలేజ్ పెంచే ప్రయత్నంలో ఉన్నారట. ఇక మీదట కూడా ఇదే దూకుడు కొనసాగించాలని ఆయన భావిస్తున్నట్టు సమాచారం. ఈ పరిస్థితుల్లో… బడ్జెట్ కేటాయింపుల తర్వాత మరోసారి మండలిలో మంటలు రేగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు పొలిటికల్ పండిట్స్. అసెంబ్లీకి వెళ్ళకున్నా… మండలిలో యాక్టివ్‌గా ఉంటూ…ప్రభుత్వాన్ని నిలదీయాలని, కీలక అంశాలపై మీడియా సమావేశాల ద్వారా పార్టీ అధినేత జగన్ స్పందించాలని డిసైడైనట్టు చెప్పుకుంటున్నాయి వైసీపీ వర్గాలు. మరో మూడు వారాల పాటు సమావేశాలు జరిగబోతున్నందున శాసనమండలిలో ఎట్టి పరిస్థితుల్లో తగ్గకుండా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నది వైసీపీ వ్యూహంగా తెలుస్తోంది. మరి అందుకు అధికార పక్షం రియాక్షన్ ఎలా ఉంటుంది? ఎలాంటి పొలిటికల్ మలుపులు ఉండబోతున్నాయన్నది ఆసక్తికరంగా మారింది.