Ravikant Sabnavis: ప్రతిష్ఠాత్మక తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాకు కొత్త సి.ఇ.ఓ. వచ్చారు. ఇటీవలే ఆహా సంస్థ రాబోయే మూడు సంవత్సరాలలో వేయి కోట్ల రూపాయలతో తమ కార్యక్రమాలను విస్తరింప చేస్తున్నట్టు ప్రకటించింది. తెలుగుతో పాటు ఇప్పుడు ఇప్పుడు ఆహా తమిళంలోకీ అడుగుపెట్టింది. రాబోయే రోజుల్లో మరిన్ని భాషల్లోకి ఇది వెళ్లబోతోంది. అలానే కొత్త జానర్ లో ప్రాజెక్ట్స్ కు ప్లాన్ చేస్తుంది. ఇందులో భాగంగా ఆహా తన కార్యనిర్వాహక బృందంలోనూ కొన్ని మార్పులు చేసింది. ఇంతవరకూ సీఇవోగా ఉన్న అజిత్ ఠాకూర్ ఇకపై బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గా తన బాధ్యతలను నిర్వర్తిస్తారని తెలిపింది. ఆయన ఆధ్వర్యంలో ఆహా స్టూడియోస్ భవిష్యత్ కార్యక్రమాల రూపకల్పన చేయనుంది. ఇదే సమయంలో ప్రముఖ పారిశ్రామిక వేత్త రవికాంత్ సబ్నవీస్ ను ఆహా కొత్త సి.ఇ.వో.గా నియమించింది.