Rashmika’s controversial comments on South movie songs: కన్నడ కస్తూరి రష్మిక మందన్నకు స్టార్ డమ్ కట్టబెట్టింది తెలుగు సినిమాలే అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కన్నడలో గుర్తింపు తెచ్చుకున్నా ఆ తర్వాత తెలుగులోనే స్టార్ గా ఎదిగింది. ఆపై తమిళంలోనూ అవకాశాలు అందిపుచ్చుకుంది. అయితే తనకు స్టార్ డమ్ ను కట్టబెట్టిన దక్షిణాది సినిమాల పాటలపై నోరు పారేసుకుంది ఈ బ్యూటీ. బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన రష్మిక అక్కడ తను నటించిన తొలి సినిమా ‘గుడ్ బై’ ఘోర పరాజయం పొందింది. అలాగే టాప్ టక్కర్ వీడియో సాంగ్ తోనూ అంత గుర్తింపు తెచ్చుకోలేక పోయింది. ఇప్పుడు సిద్ధార్థ్ మల్హోత్రాతో కలసి నటించిన ‘మిషన్ మంజు’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇది జనవరి 23న విడుదల కానున్న నేపథ్యంలో ప్రచారంలో పాల్గొంటోంది రష్మిక. అందులో భాగంగానే దక్షిణాది సినిమాలు మాస్ మాసాల పాటలు, ఐటమ్ సాంగ్స్ తో నిండి ఉంటాయని వ్యాఖ్యానించింది. అంతే కాదు ‘మిషన్ మజ్ను’లోని రొమాంటిక్ పాటను ఆకాశానికి ఎత్తేసింది.
Read Also: Vallabhaneni Janardhan: నటుడు, నిర్మాత, దర్శకుడు వల్లభనేని జనార్ధన్ ఆకస్మిక మృతి
తను తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ‘ఛలో’ సినిమాలో ‘చూసి చూడంగానే’ మెలోడి, ‘గీతగోవిందం’లో అద్భుతమైన పాటలు, ‘డియర్ కామ్రేడ్’లో పాటలు, అంతెందుకు ఇటీవల తను గెస్ట్ గా నటించిన ‘సీతా రామం’లోని మెలోడీ పాటలను మర్చిపోయిందా అంటున్నారు దక్షిణాది ప్రేక్షకులు. బాలీవుడ్ వారి ప్రాపకం కోసం తనను అందలం ఎక్కించిన దక్షిణాది వారిని కించపరచటం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియాలో రష్మిక మన సినిమాల పాటల గురించి చేసిన కామెంట్ వైరల్ అవుతోంది. కొంత మంది సినీ ప్రేమికులు ఈ వీడియోను అల్లు అర్జున్ కు ట్యాగ్ చేసి మరీ ‘పుష్ప2’ నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఏరుదాటిన తర్వాత తెప్ప తగలేయటం అంటే ఇదే అని కూడా అంటున్నారు. తన వ్యాఖ్యలపై రష్మిక పునరాలోచించుకోవాలని, దక్షిణాది వారికి సారీ చెప్పాలని అంటున్నారు. మరి కన్నడ బ్యూటీ దీని గురించి ఏం చెబుతుందో చూద్దాం.