ఇటీవల కాలంలో తెలుగు చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ అంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలే అని చెప్పక తప్పదు. ఓ వైపు ప్రకాశ్ రాజ్ ప్యానెల్, మరో వైపు మంచు విష్ణు ప్యానెల్ హోరాహోరీగా తలపడ్డాయి. ఎమ్మెల్లే ఎన్నికల తరహాలో జరిగిన ఈ ఎలక్షన్లలో మంచు విష్ణు ప్యానెల్ లో మెజారిటీ సభ్యలు విజయం సాధించారు. అయితే ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుంచి గెలుపొందిన సభ్యలు ఆ తర్వాత ఎన్నికల ప్రక్రియను, మోహన్ బాబు దూషణ పర్వాన్ని నిరసిస్తూ రాజీనామాలను ప్రకటించారు. అయితే అధ్యక్షుడుగా ఎన్నికైన విష్ణు వారి రాజీనామాలను అంగీకరించబోనన్నారు. ఇదిలా ఉంటే శనివారం విష్ణు ప్యానెల్ ప్రమాణ స్వీకారం చేసింది.
Read Also : ‘మా’ ఆనవాయితీని బ్రేక్ చేసిన మంచు విష్ణు
గమనించదగ్గ విషయం ఏమంటే విష్ణు ప్యానెల్ నుంచి కార్యదర్శిగా ఎన్నికైన రఘుబాబు ఈ ప్రమాణ స్వీకారానికి డుమ్మా కొట్టడం. నిజానికి రఘుబాబు టాలీవుడ్ లో బిజీగా ఉన్న నటుడు. ఏ అసోషియేషన్ లో అయినా కార్యదర్శికి ఉండే బాధ్యత అంతా ఇంతా కాదు. ఓ విధంగా చెప్పాలంటే అధ్యక్షుడి కంటే సెక్రెటరీకే ఎక్కువ బాధ్యత ఉంటుంది. మరి అంత బరువును రఘుబాబు మోయగలరా? అన్నదే అందరి మదిలో ఉన్న ప్రశ్న. ప్రమాణ స్వీకారానికే హాజరు కాలేక పోయిన రఘుబాబు ‘మా’ కార్యదర్శిగా బరువు బాధ్యతలను ఎంత సక్రమంగా నిర్వహించగలరన్నది ఆలోచించవలసిన విషయం. కార్యదర్శి కేవలం రబ్బరు స్టాంప్ గా ఉండకూడదు. బాధ్యతలు మోయగలిగితేనే బరిలో నిలవాలి. మరి రాబోయే రోజుల్లో రఘుబాబు ఎంత వరకూ కార్యదర్శిగా తన బరువు బాధ్యతలను మోయగలరో చూడాలి. (రఘుబాబు కార్యక్రమం ముగిసే సమయంలో హాజరై ప్రమాణ స్వీకారం చేసి, సర్టిఫికేట్ అందుకోవడం విశేషం).