Director Krish: గచ్చిబౌలిలో డ్రగ్స్ కలకలం రేగింది. గచ్చిబౌలి రాడిసన్ హోటల్‌లో డ్రగ్స్ తీసుకున్న కొందరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. యువకులందరూ రాడిసన్ హోటల్‌లో ఘనంగా పార్టీ చేసుకున్నారని వీరిలో ప్రముఖ బీజేపీ నేత కుమారుడు, వ్యాపారవేత్త కుమారుడు కూడా ఉన్నారని తేల్చారు. పక్కా సమాచారంతో పోలీసులు రాడిసన్ హోటల్‌పై దాడి చేయగా అక్కడ యువకులు పెద్ద ఎత్తున డ్రగ్స్ తీసుకున్నారు. డ్రగ్స్ తీసుకున్న ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి పెద్ద మొత్తంలో కొకైన్ స్వాధీనం చేసుకున్నారని చెబుతున్నారు. ఇక రాడిసన్ డ్రగ్ పార్టీ ఎఫ్ఐఆర్ లో కీలక విషయాలను పోలీసులు పొందుపరిచారు. ఇక ఈ కేసులో ఇద్దరు అమ్మాయితో పాటు తొమ్మిది మందిపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక ఇప్పటికే ఈ డ్రగ్స్ కేసులో మోడల్ లిపి గణేష్, టాలీవుడ్ నిర్మాత ఇలా వరుసగా పేర్లు బయటపడుతున్నాయి.
తాజాగా ఈ డ్రగ్స్ తో టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అంతేకాకుండా ఎఫ్ఐఆర్ లో క్రిష్ పేరును గచ్చిబౌలి పోలీసులు చేర్చడం జరిగింది. ఎఫ్ఐఆర్ లో ఎనిమిదో నిందితుడిగా క్రిష్ ను చేర్చారు. పార్టీ జరుగుతున్న సమయంలో క్రిష్ ర్యాడిసన్ హోటల్ లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పార్టీ జరుగుతున్న రూమ్లో అరగంట పాటు కూర్చున్నారని, ర్యాడిసన్ యజమాని వివేకానందతో ఆయన మాట్లాడినట్లు పోలీసులు తెలిపారు. ఎఫ్ఐఆర్ లో ఉన్న నిందితులందరిని పిలిచి విచారిస్తామని వారు తెలిపారు.
ఇక ఈ కేసుపై డైరెక్టర్ క్రిష్ స్పందించాడు. తాను హోటల్ కు వెళ్లడం నిజమే అని ఒప్పుకున్నాడు. సాయంత్రం ఒక అరగంట మాత్రం నేను అక్కడ ఉన్నాను అని, కేవలం ఫ్రెండ్స్ కలవడానికి మాత్రమే అక్కడికి వెళ్లినట్లు తెలిపాడు. సాయంత్రం ఆరు గంటల 45 నిమిషాలకు తాను హోటల్ నుంచి బయటకు వచ్చేసానని, హోటల్ యజమాని వివేకనందతో అప్పుడే పరిచయం ఏర్పడిందని తెలిపాడు. తన డ్రైవర్ లేకపోవడంతో వివేకనందతో అరగంట పాటు మాట్లాడానని, డ్రైవర్ రాగానే పార్టీ నుంచి వెనక్కి వెళ్లిపోయినట్లు చెప్పుకొచ్చాడు. ఈ విషయం పోలీసులకు కూడా చెప్పాను అని చెప్పిన క్రిష్ దీనిపై వాళ్ళు కూడా తనను ఒక స్టేట్మెంట్ అడిగినట్లు తెలిపాడు. ఈ డ్రగ్స్ తో తనకేం సంబంధం లేదని స్పష్టం చేశాడు. ఇకపోతే ప్రస్తుతం ప్రస్తుతం క్రిష్.. పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.