బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ రాధికా ఆప్టే గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు.. తెలుగులో బాలకృష్ణ సరసన ‘లెజెండ్’ లో నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ నిత్యం ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటూనే ఉంటది. ఆ మధ్యన టాలీవుడ్ లో తనపై ఒక హీరో లైంగిక వేధింపులకు గురిచేసాడని చెప్పి షాక్ ఇచ్చిన రాధికా ఈసారి తన సహా హీరోయిన్లపై సంచలన వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రాధికా మాట్లాడుతూ “నాకు తెలిసి చిత్ర పరిశ్రమలో ఉన్న హీరోయిన్లందరూ సర్జరీలు చేయించుకున్నవారే.. శరీరాకృతికి ప్రాధాన్యం ఇవ్వకూడదు అని చెప్తూనే చాలామంది సర్జరీలు చేయించుకోవడం నేను చూసాను. ముఖ్యంగా పరిశ్రమలో వయస్సుతో పోరాడలేక తారలు శరీరంతో పోరాడుతున్నారు.
ముఖాన్ని, శరీరాన్ని మార్చుకోవడానికి నాకు తెలిసిన చాలామంది సహ నటీనటులు కాస్మోటిక్ సర్జరీలు చేయించుకున్నారు. అదంతా నా వల్ల కాదు. అవన్నీ చూసి నేను విసిగిపోయాను. కేవలం హీరోయిన్ గా నా పని ఏదో నేను చూసుకుంటాను.. కానీ ఇలాంటి రంగంలో నేను ఇమడలేను. కాలక్షేపం కోసం కబుర్లు చెప్పుకోవడం, తమ గొప్పతనాన్ని ఇతరుల ముందు ప్రదర్శించే ధోరణి పరిశ్రమలో ఎక్కువగా కనిపిస్తుంది.. నాకు ఇలాంటివి అస్సలు నచ్చవు” అని చెప్పుకొచ్చింది. అయితే రాధికా మాటలు బి టౌన్ లో కొంతమంది హీరోయిన్లను ఎత్తి చూపినట్టే అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక రాధికా కెరీర్ విషయానికొస్తే ప్రస్తుతం ఆమె `విక్రమ్ వేద`లో కనిపించనుంది. ఇందులో హృతిక్ రోషన్ -సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మరి ఈ వ్యాఖ్యలపై బాలీవుడ్ తారలు ఎవరైనా స్పందిస్తారేమో చూడాలి.