ఏపీ ఫైబర్ చైర్మన్ గౌతమ్ రెడ్డి ఇటీవలే మాట్లాడుతూ ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ అనే కొత్త ప్రోగ్రాం ని లాంచ్ చేస్తున్నట్లు తెలిపాడు. ఈ ప్రోగ్రామ్ లో మొదటి రోజు నుంచే సినిమాలని టీవీల్లో లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వనున్నారు. దీంతో పల్లెల్లో ఉన్న వాళ్లు సినిమా చూడడానికి టౌన్ వరకు రావాల్సిన అవసరం లేదు, ఇంట్లో కూర్చొనే రీఛార్జ్ చేసుకోని సినిమా చూడొచ్చు అని చెప్పాడు. ఈ ఫస్ట్ డే ఫస్ట్ షో ప్రోగ్రామ్ పై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. దీని కారణంగా థియేటర్స్ లో సినిమాల మనుగడ కష్టం అవుతుంది అనే కామెంట్స్ వస్తున్నాయి. ఇండస్ట్రీ వర్గాలు, సినీ అభిమానులు ఈ ఫస్ట్ డే ఫస్ట్ షో గురించి చర్చలు జరుపుతుండగానే ఈరోజు ‘నిరీక్షణ’ సినిమాతో ఫస్ట్ డే ఫస్ట్ షో ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపొయింది. ఈ విషయంపై సానుకూలంగా స్పందిస్తూ ప్రొడ్యూసర్ సీ కళ్యాణ్ షాకింగ్ కామెంట్స్ చేసాడు.
“148 దేశాల్లో పస్ట్ డే పస్ట్ షో వంటి ప్రయోగమే లేదు. మారుమూల గ్రామాల ప్రేక్షలకు ఎంతో ఉపయోగం. పస్ట్ డే పస్ట్ షో నిర్ణయం తీసుకున్న సీఎం జగన్ కు ధన్యవాదాలు. తెలుగు ఇండస్ట్రీకి ఎటు వంటి ఇబ్బంది ఉండదు. దియేటర్లకు, నిర్మాతలకు ఎలాంటి నష్టం జరగదు. చిన్న సినిమాలకు ఎంతో ఉపయోగ పడుతుంది. పస్ట్ డే పస్ట్ షో అనేది మంచి ప్రయోగం. చిన్న సినిమాలు బతుకుతాయి. కొంతమంది సినిమా వాళ్ళ విమర్శలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పస్ట్ డే పస్ట్ షో విజయవంతం అవుతుంది. ఈ రోజు విమర్శలు చేసిన వారు రేపు మీ దగ్గరకు వస్తారు” అంటూ సీ కళ్యాణ్ మాట్లాడాడు. సీకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై జ్యోతి లక్ష్మి, లోఫర్, జై సింహా, ఇంటెలిజెంట్ లాంటి సినిమాలని ప్రొడ్యూస్ చేసాడు సీ కళ్యాణ్. ఇటీవలే జరిగిన తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి ఎన్నికల్లో దిల్ రాజుకి అపోజిట్ లో పోటీ చేసి సీ కళ్యాణ్ ఓడిపోయాడు.