విక్టరీ వెంకటేష్ కెరీర్ లో మైలురాయిగా నిలిచిపోయిన సినిమాల్లో ‘ప్రేమించుకుందాం రా’ ఒకటి. జయంత్ సి. పరాన్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో 50 కి పైగా సెంటర్లలో సెంచరీ కొట్టింది. 57 సెంటర్లలో 50 రోజులు ఆడిన తొలి తెలుగు సినిమాగా రికార్డు సృష్టించింది. ఈ చిత్రంలో వెంకటేష్ సరసన అంజలి జావేరి నటించింది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ అయ్యి తాజాగా పాతికేళ్ళు పూర్తి చేసుకొంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సిల్వర్ జూబ్లీ వేడుకల్ని ఘనంగా జరుపుకుంది. ‘రీయూనియన్ మ్యాడ్ నెస్ ఎట్ హోమ్’ పేరుతో ఈ వేడుకలకు సంబంధించిన ఫోటోలను డైరెక్టర్ జయంత్ సి.పర్జానీ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.
వెంకటేష్ కేక్ కట్ చేసి షాంపైన్ పొంగించారు. ఇక ‘ప్రేమించుకుందాం రా’ చిత్రం అనగానే లిటిల్ హార్ట్స్ బిస్కెట్స్ యే గుర్తుకువస్తాయి. అంజలికి తన ప్రేమను వ్యక్తపరచడానికి వెంకీ లిటిల్ హార్ట్స్ బిస్కెట్స్ ఇవ్వాలని ప్రయత్నించడం, వాటిని వేరొకరు తీసుకెళ్లిపోవడం.. ఈ సీన్ ఇప్పటికి తెలుగు ప్రేక్షకులకు గుర్తుండే ఉంటుంది. వేడుకలో భాగంగా బాబు మోహన్, బెనర్జీ, హేమ, వి.ఎన్ ఆదిత్య మరి కొంతమంది సినీ ప్రముఖలు పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.