ప్రభాస్ నటించిన ‘రాధే శ్యామ్’ ఈనెల 11న విడుదల కానుంది. మాస్ ఇమేజ్ ఉన్న ప్రభాస్ క్లాస్ టచ్ తో ‘రాధే శ్యామ్’ చేయటం నిజంగా రిస్క్ అనే అనుకోవాలి. గతంలో కూడా తెలుగులో పలు ప్రేమ కథా చిత్రాలు చేశాడు ప్రభాస్. ‘వర్షం, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్’ వంటివి ఆ కోవకే చెందుతాయి. అయితే పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ వచ్చిన తర్వాత ప్రేమకథా చిత్రం చేయటం మాత్రం ముమ్మాటికి హై రిస్క్ అనే అనుకోవాలి. ప్రభాస్ సైతం ఇదే విషయాన్ని ఒప్పుకున్నాడు కూడా. అయితే అదే వెరైటీ అని, ఆ రిస్క్ పేయింగ్ ఎలిమెంట్ అవుతుందని నమ్ముతున్నాడు. బాలీవుడ్ ఆడియన్స్ ని డబ్బింగ్ సినిమాలతో అలరించిన ప్రభాస్ ఆ తర్వాత ‘బాహుబలి’ సీరీస్, ‘సాహో’ సినిమాలతో మెప్పించాడు. దాంతో ప్రభాస్ ప్రతి సినిమా పాన్ ఇండియా సినిమాగానే తెరకెక్కుతోంది. అందుకేనేమో ఉత్తరాది ప్రేక్షకులు తన ‘రాధే శ్యామ్’ను ఎలా రిసీవ్ చేసుకుంటారనే భయంతో ఉన్నానని అంటున్నాడు.
చిత్రపరిశ్రమలో తన సన్నిహితులు, తోటి నటీనటులను ఆతిథ్యంతో ఉక్కిరి బిక్కిరి చేసే ప్రభాస్ అభిమానులతో ఎప్పుడూ టచ్ లో ఉంటూ కలిసినపుడే వారికి ఏమిష్టం, తనని వారు ఎలా చూడాలనుకుంటున్నారో అడిగి తెలుసుకుంటుంటాడట. మాస్ లో సూపర్ ఇమేజ్ వచ్చిన తర్వాత ఫ్యాన్స్ తనను యాక్షన్ మోడ్ లో చూడాలనుకుంటున్నారనేది ప్రభాస్ కి బాగా అర్ధం అయిందట. ‘రాధే శ్యామ్’లో ఫైట్స్ లేవని నిరాశపడే అభిమానులను అందులోని లవ్ స్టోరీ మెస్మరైజ్ చేస్తుందని భావిస్తున్నాడు. ప్రేమకథా చిత్రం ‘డార్లింగ్’లో 5 ఫైట్లు ఉన్నా… ఫ్యాన్స్ యాక్షన్ కంటే కథని ఇష్టపడతారని స్పష్టం చేసింది. తను యాక్షన్ చేయడం ఇష్టపడ్డా… కేవలం యాక్షన్ ను మాత్రమే కాదని నొక్కి చెబుతున్నాడు ప్రభాస్.
‘రాధే శ్యామ్’ సెన్సార్ టాక్ లో స్లోగా ఉందని వినిపించింది. అయితే ఇది ప్రేమకథతో కూడిన సినిమా కాబట్టి అలా అనిపించి ఉండవచ్చని, ఫస్ట్ హాఫ్ లో ఛేజ్ సీక్వెన్స్ తో పాటు టైటానిక్ మూవీలోలా 13 నిమిషాల షిప్ ఎపిసోడ్ టెంపోతో ఉండి అందరినీ ఆకట్టుకుంటుందని యూనిట్ పూర్తి కాన్ఫిడెన్స్ తో ఉంది. కానీ సినిమాలో ఒక్క యాక్షన్ ఎపిసోడ్ కూడా లేదనే వార్త ఫ్యాన్స్ ని బాగా కలవరపెడుతుంది. విభిన్న చిత్రాల కోసం ట్రై చేస్తున్నప్పుడు ఇలాంటి కామెంట్స్ రావటం సహజమేనని, అంతిమంగా విజయమే సమాధానం అవుతుందని ప్రభాస్ నమ్ముతున్నాడు. మరి ప్రభాస్ ‘రాధే శ్యామ్’తో చేస్తున్న రిస్క్ ఎంత వరకూ అతడిని నిలబెడుతుందో చూద్దాం.