Rave Party: ఇవాళ గ్లోబల్ మార్కెట్ ఓపెన్ అయ్యింది. పాన్ ఇండియా స్థాయి నుంచి పాన్ వరల్డ్ స్థాయికి ప్రాంతీయ సినిమా ఎదిగింది. దానికి తగ్గట్టుగానే ప్రేక్షకుడి ఆలోచన మారింది. మూవీ లవర్స్ అభిరుచికి తగ్గట్టుగానే నేటి తరం దర్శకులు తెరకెక్కించే చిత్రాల్లో ఆ వైవిధ్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. వినూత్నమైన సినిమాలను అలరించే ప్రేక్షకుల కోసం అంతే వైవిధ్యభరితమైన కథతో రాబోతోంది ‘రేవ్ పార్టీ’. బోనగాని ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రాజు బోనగాని దర్శకత్వ సారథ్యంలో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న సినిమా ఇది. కన్నడ, తెలుగు, హిందీ, తమిళ్, మలయాళ భాషలలో విడుదల చేయాలనే తలంపుతో నిర్మితమౌతున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు మార్చి 24న జరిగాయి. ఈ కార్యక్రమానికి ‘ది కశ్మీరీ ఫైల్స్’ ప్రొడ్యూసర్ అభిషేక్ అగర్వాల్, ‘టైగర్ నాగేశ్వరరావు’ డైరెక్టర్ వంశీ, ”మేజర్, గూఢచారి” చిత్రాల దర్శకులు శశికిరణ్ టిక్కా, యుఎఫ్ వైస్ ప్రెసిడెంట్ లక్ష్మణ్ తదితరులు హాజరయ్యారు.
ఈ చిత్రంలో క్రిష్ సిద్దిపల్లి హీరోగా నటిస్తున్నాడు. ఇతర ప్రధాన పాత్రలను సుచేంద్ర ప్రసాద్, తారక్ పొన్నప్ప, ప్రతిమ తదితరులు పోషించబోతున్నారు. సినిమాటోగ్రాఫర్ గా వెంకట్ మన్నం, సంగీత దర్శకుడిగా దిలీప్ బండారి వర్క్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. డైరెక్టర్ రాజు బొనగాని మాట్లాడుతూ, ”ఇది స్ట్రయిట్ కన్నడ మూవీ. దీన్ని ఇతర భారతీయ భాషల్లోనూ డబ్ చేసి విడుదల చేస్తాం. ఏప్రిల్ 3 నుంచి షూటింగ్ ప్రారంభించి శరవేగంగా సింగిల్ షెడ్యూల్ లో పూర్తి చేస్తాం” అని అన్నారు. కథ గురించి వివరిస్తూ, ”మాములుగా మనం చాలా రకాల రేవ్ పార్టీల గురించి వార్తల్లో చదువుతూ ఉంటాం, సోషల్ మీడియాల్లో చూస్తూ ఉంటాం. అయితే అసలు రేవ్ పార్టీలో ఏం జరుగుతుంది? ఆ పార్టీలో యూత్ ఎలా ప్రవర్తిస్తుంటారు? అక్కడ వాళ్ళు వాడే డ్రగ్స్ ఎలాంటివి? ఈ రకమైన సంప్రదాయాన్ని రాజకీయ నేతులు ఎందుకు ప్రొత్సహిస్తున్నారు? దాని వెనుక ఉన్న ప్రయోజనాలు, అజెండా ఏమిటీ? అనేది రియలిస్టిక్ గా తెర మీద చూపించబోతున్నాం. ఉడిపి, గోవా, మణిపాల్ లాంటి ప్రాంతాలలో ఎక్కువ ఈ రకమైన పార్టీలు జరుగుతుంటాయి. అందుకోసం ఈ చిత్రాన్ని ఆ ప్రదేశాలలోనే చిత్రికరించాడానికి ప్లాన్ చేశాం” అని అన్నారు.