Ponge Nadi Lyrical Song Released From Ponniyin Selvan: ఏఆర్ రెహమాన్ పాటలంటే.. ఏదో విన్నామా, పక్కన పెట్టేశామా? అన్నట్టు ఉండవు. అవి ఓ ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తాయి. పాటలు వింటున్నంతసేపు ఓ తెలియని ఊహలోకి వెళ్లిపోతాం. ఇప్పుడు పొన్నియన్ సెల్వన్ నుంచి విడుదలైన ‘పొంగే నది’ పాట వింటే.. అలాంటి అనుభూతే కలుగుతుందని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. ‘కావేరిరా నీ ఎదుట’ అంటూ మెల్లగా ప్రారంభమయ్యే ఈ పాట ఒక్కసారిగా ఊపందుకుంటుంది. ఇక ఏఆర్ రెహమాన్ గాత్రం వచ్చాక అందరూ మైమరిచిపోవడం ఖాయం. లిరికల్ సాంగ్‌లో చూపించిన గ్రాఫికల్ విజువల్స్ కూడా అదిరిపోయాయి. అనంత శ్రీరామ్ రాసిన సాహిత్యం ఆలోచింపచేస్తుంది. ఓవరాల్‌గా పాట అదిరిపోయిందని చెప్పుకోవచ్చు.
కాగా.. మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్య రాయ్, జయం రవి, త్రిషా, ఐశ్వర్య లక్ష్మీ, శోభితా ధూళిపాళ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. శరత్ కుమార్, ప్రభు, ప్రకాశ్ రాజ్, తదితర ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషించారు. ఇది తన డ్రీమ్ ప్రాజెక్ట్ కావడంతో.. మణిరత్నం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. రూ. 500 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రెండు భాగాల్లో రూపొందుతోంది. తొలి భాగాన్ని సెప్టెంబర్ 30వ తేదీన విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమాని విడుదల చేయనున్నారు.