గత కొంతకాలంగా రజనీకాంత్ నుండి అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఏదీ రాలేదనే బాధ అతని అభిమానులకు ఉంది. ఏదో ఒక జానర్ కు ఆయన పరిమితమైపోతున్నారని, మరీ ముఖ్యంగా ‘కబాలి, కాలా, పేట, దర్బార్’ వంటి చిత్రాలతో ఒకే తరహా వర్గాన్ని ఆయన దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేస్తున్నారని వారంత భావిస్తున్నారు. ఈసారి ఆ లోటును తీర్చడానికన్నట్టుగా ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ విత్ సిస్టర్ సెంటిమెంట్ మూవీ ‘పెద్దన్న’ను చేశాడు రజనీకాంత్. సన్ పిక్చర్స్ సంస్థ శివ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమా దీపావళి కానుకగా గురువారం విడుదలైంది.
రాజోలు చుట్టుపక్కల గ్రామాలలో వీరన్న (రజనీకాంత్)కు మంచి గుర్తింపు ఉంటుంది. బీదల పక్షాన నిలిచే వీరన్నకు ఒక్కగానొక్క చెల్లి కనకం (కీర్తి సురేశ్). అతనికి లాయర్ పార్వతి (నయనతార)తో జరిగిన పరిచయం ప్రేమగా మారుతుంది. అయితే పెళ్ళికి ఎదిగిన చెల్లి వివాహం ముందు ఘనంగా చేయాలని వీరన్న భావిస్తాడు. అతని ఇద్దరు మరదళ్ళు (ఖుష్బూ, మీనా) తమ తమ్ముళ్ళను కనకంకు ఇచ్చి బంధుత్వాన్ని కలుపుకోవాలని చూసినా, వీరన్న వారిస్తాడు. గతంలో వీరన్నకు ప్రత్యర్థిగా ఉన్న దేవరాజ్ (ప్రకాశ్ రాజు) మంచివాడిగా మారి, డాక్టర్ అయిన తన తమ్ముడి పెళ్ళి వీరన్న చెల్లితో చేయమని కోరతాడు. అందుకు అంగీకరించి అంగరంగ వైభవంగా పెళ్ళి జరపబోతుండగా ఊహించని ఘటన ఒకటి ఆ కుటుంబాన్ని అతలాకుతలం చేస్తుంది. పల్లెటూరిలో గౌరవంగా బ్రతుకుతున్న వీరన్న కోల్ కతా ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? అక్కడి రౌడీ పారిశ్రామిక వేత్తలతో ఎందుకు ఢీ కొట్టాల్సి వచ్చింది? అనేది మిగతా కథ.
‘పెద్దన్న’ సినిమాకో ప్రత్యేకత ఉంది. మనం థియేటర్ లోకి అడుగు పెట్టీ పెట్టగానే ఓ మూడు, నాలుగు దశాబ్దాల వెనక్కి ఈ మూవీ మనల్ని తీసుకెళ్ళిపోతుంది. కథ, కథనం, ఇందులోని పాత్రల తీరుతెన్నులు అన్నీ కూడా మనల్ని ఆ కాలంలోకి లాక్కెళ్ళిపోతాయి. కానీ దర్శకుడు మాత్రం ప్రస్తుతం మన మధ్య జరుగుతున్న కథగానే దీన్ని భావించమంటాడు. సినిమా కోసం ఎంచుకున్న కథ సరళమైనదే అయినా, దాన్ని సాగదీసి, సాగదీసి చూపడంతో ఇంటర్వెల్ కార్డ్ వేయడం డైరెక్టర్ మర్చిపోయాడేమో అనే సందేహం వస్తుంది. పొరుగు రాష్ట్రంలో పెద్ద చదువులు చదివే చెల్లి వారం వారం తన గ్రామానికి రావడం, ఆమె వచ్చినప్పుడు వీరన్న చేసే హడావుడీ నిజంగానే కామెడీగా ఉంటాయి. అలానే చేసిన కొన్ని తప్పుల కారణంగా వీరన్న పోలీస్ స్టేషన్ కు వచ్చి సంతకం పెట్టడం, ఓ ముసలాయనకు న్యాయం చేయడం కోసం కోర్టు తలుపులు తట్టడం, అక్కడ లాయర్ పార్వతి పరిచయం కావడం వింతగా అనిపిస్తుంది. అంతలోనే ఆమె వీరన్న మంచి తనం చూసి మనసు పారేసుకోవడం కూడా చిత్రంగా జరిగిపోతుంది. పోలీస్ స్టేషన్, కోర్టు దగ్గర వీరన్నతో గొడవకు దిగిన దేవరాజ్ కు దేవాలయం దగ్గర వీరన్న తీసుకున్న క్లాస్ తో కనువిప్ప కలగడం మరో ట్విస్ట్. వీటితో పాటు తమ తమ్ముళ్ళు ను వీరన్న చెల్లికి ఇచ్చి పెళ్ళి చేయమంటూ ఇటు రాజేశ్వరి (ఖుష్బూ), అటు మహేశ్వరి (మీనా) ఒకరితో ఒకరు పోటీపడటం, వాళ్ళ భర్తలు బఫూన్ల మాదిరి ప్రవర్తించడం అదో పెద్ద పేలని కామెడీ. ఇది చాలదన్నట్టు కథను కలకత్తాకు చేర్చి, అక్కడ మనోజ్ పాలేకర్ (అభిమన్యుసింగ్), అతని అన్న ఉద్థవ్ పాలేకర్ (జగపతిబాబు)తో పగ, ప్రతీకారాలు అంటూ మరో ట్విస్ట్. మొత్తం మీద ప్రధమార్థంలో ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ ను, ద్వితీయార్ధంను యాక్షన్ అండ్ సిస్టర్ సెంటిమెంట్ గా మిక్స్ చేసి దర్శకుడు శివ ‘పెద్దన్న’ను పండగ కానుకగా వండి వడ్డించే ప్రయత్నం చేశాడు.
నటీనటుల విషయానికి వస్తే, రజనీకాంత్ ను ఏ ఒక్క సీన్ లోనూ కొత్తగా కనిపించలేదు. అయితే కొన్ని సన్నివేశాల్లో మాత్రం కాస్తంత హుషారుగా, అందంగా కనిపించాడు. నయనతార ది హీరోయిన్ పాత్ర అనేకంటే హీరో సహాయకురాలి పాత్ర అనడం కరెక్ట్. వారిద్దరి మధ్య ఎలాంటి లవ్ కెమిస్ట్రీ మనకు పెద్దంతగా కనిపించదు. దర్శకుడు అందుకోసం కృషి కూడా చేయలేదు. అన్నాచెల్లెళ్లుగా రజనీ, కీర్తి సురేశ్ స్క్రీన్ మీద చక్కగా ఉన్నారు. కీర్తి సురేశ్ చక్కని నటన కనబరిచింది. ద్వితీయార్థంలో సెంటిమెంట్ నూ పండించింది. అయితే పెళ్ళికి ముందు ఆమె తీసుకునే నిర్ణయాన్ని దర్శకుడు కన్వెన్సింగ్ గా చూపించలేదు. ప్రకాశ్ రాజ్ కు ఈ తరహా పాత్రలు కొట్టిన పిండి. ఫస్ట్ హాఫ్ కే ప్రకాశ్ రాజ్ పాత్ర పరిమితం కాగా, సినిమా చివరిలో జగపతిబాబు పాత్ర వస్తుంది. ఆయన పాత్రకు ఇచ్చిన బిల్డప్ కు తగ్గట్టుగా ఆ తర్వాత దాన్ని డైరెక్టర్ తీర్చిదిద్దలేదు. ప్రతినాయకులైన అన్నదమ్ముల మధ్య కాన్ ఫ్లిక్ట్ కూడా అర్థంలేనిదిగా ఉంది. అభిమన్యు సింగ్, అరవింద్ కృష్ణ, సూరి, లివింగ్ స్టన్, పాండిరాజన్ తదితరులు ఇందులో ఇతర ప్రధాన పాత్రలు పోషించారు.
సన్ పిక్చర్స్ సంస్థ నిర్మాణం విషయంలో రాజీ పడలేదు. భారీగానే ఈ సినిమాను నిర్మించింది. అలానే వెట్రీ సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు. డి. ఇమాన్ స్వరాలు కొన్ని బాగానే ఉన్నాయి. కానీ నేపథ్య సంగీతం కర్ణకఠోరం! దర్శకుడు శివ ఏదో తీయాలనుకుని ఏదో తీసినట్టుగా అనిపిస్తోంది. కథ పాతదే అయినా కనీసం కథనం కాస్తంత ఆసక్తిరంగా ఉండి ఉంటే ఈ సిస్టర్ సెంటిమెంట్ మూవీని జనం కొంతలో కొంత ఆదరించే ఆస్కారం ఉండి ఉండేది. కానీ శివ బొత్తిగా నేలవిడిచి సాము చేశాడు!
ప్లస్ పాయింట్స్:
ప్రొడక్షన్ వాల్యూస్
వెట్రి సినిమాటోగ్రఫీ
యాక్షన్ సీన్స్
మైనెస్ పాయింట్:
పేలవమైన కథ, కథనాలు
పండని సిస్టర్ సెంటిమెంట్
బలహీనమైన క్లయిమాక్స్
రేటింగ్: 2.5 / 5
ట్యాగ్ లైన్: నేల విడిచి సాము!