Pawan kalyan: మెగాస్టార్ చిరంజీవి ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్-2022 గా ఎంపిక అయిన విషయం తెలియడంతో టాలీవుడ్ మొత్తంవేడుకల్లో మునిగిపోయింది. ఇన్నాళ్లు ఆయన చిత్ర పరిశ్రమకు అందించిన సేవలను గుర్తించి కేంద్రప్రభుత్వం ఈ అవార్డును చిరుకు అందించనుంది. ఇక దీంతో చిరుకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా జనసేన అధినేత, చిరంజీవి తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అన్నకు శుభాకాంక్షలు తెలిపారు.
“అన్నయ్య చిరంజీవి గారికి హృదయపూర్వక అభినందనలు.. తెలుగు చలన చిత్రసీమలో శిఖర సమానులు, అన్నయ్య శ్రీ చిరంజీవి గారిని ‘ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్-2022’ పురస్కారం వరించడం ఎంతో సంతోషాన్ని కలిగించింది. గోవాలో జరుగుతున్న 53వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో భాగంగా భారత ప్రభుత్వం ప్రకటించిన ఈ పురస్కారం అన్నయ్య కీర్తి కిరీటంలో చేరిన మరొక వజ్రం. ఈ ఆనంద సమయంలో నా మార్గదర్శి అన్నయ్య చిరంజీవి గారికి హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తున్నాను. నాలుగు దశాబ్దాలుపైబడిన అన్నయ్య సినీ ప్రస్థానం, తనను తాను మలచుకొని ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థానం సంపాదించుకోవడం నాతో సహా ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం. అంతర్జాతీయ చలన చిత్ర వేదికపై అన్నయ్య చిరంజీవి గారికి ఈ గౌరవం దక్కుతున్నందుకు ఎంతో ఆనందిస్తున్నాను”అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.