డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి సినిమాల తర్వాత చాలా కాలానికి ప్రభాస్ నుంచి వచ్చిన లవ్ స్టోరీ ఫిల్మ్ రాధే శ్యామ్. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేసింది. ఒక్క ఫైట్ కూడా లేకుండా బాహుబలి కటౌట్ చేసిన ఈ సినిమా ఫ్యాన్స్‌ను గట్టిగా డిజప్పాయింట్ చేసింది. కానీ ఫుల్ యాక్షన్ మోడ్ లో ఉన్న ప్రభాస్ ని చాలా రోజులకు ఓ లవ్‌స్టోరీ సినిమాలో కూల్‌గా చూశామని హ్యాపీ ఫీల్ అయ్యారు కొంతమంది డార్లింగ్ ఫ్యాన్స్. ఏది ఏమైనా మిస్టర్ పర్ఫెక్ట్ టైం ప్రభాస్ మార్కెట్ అండ్ క్రేజ్ కి, ఇప్పటి ప్రభాస్ మార్కెట్ అండ్ క్రేజ్ కి ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉందనేది వాస్తవం. స్కై హై ఇమేజ్ ని మైంటైన్ చేస్తున్న ప్రభాస్ తో అందరూ చేస్తున్న సినిమాలు కూడా కమర్షియల్ పంథాలోనే సాగుతున్నాయి. ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కె, మారుతీ సినిమా, స్పిరిట్… ఇలా అన్ని యాక్షన్ సినిమాలే. అయితే ఈ సినిమాల మధ్యలో ప్రభాస్ ఓ ప్యూర్ లవ్ స్టోరీ సినిమా చేయబోతున్నట్టు తెలుస్తోంది.
ఈ మధ్య కాలంలో వచ్చిన మంచి క్లాసిక్ లవ్ స్టోరీ సినిమా ఏదైనా ఉందా అంటే.. అది ఖచ్చితంగా సీతారామం సినిమా అనే చెప్పాలి. ఈ సినిమాతో దర్శకుడు హను రాఘవపూడి క్లాసిక్ హిట్ అందుకున్నాడు. ఈయనతోనే ప్రభాస్ ఓ లవ్ స్టోరీ చేయబోతున్నాడట. ఇప్పటికే హను రాఘవపూడి కథపై కసరత్తులు చేస్తున్నాడట. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్, వైజయంతి బ్యానర్స్ కలిసి నిర్మించే అవకాశాలున్నాయి అంటున్నారు. ప్రజెంట్ ప్రభాస్‌తో ప్రాజెక్ట్ కె మూవీని నిర్మిస్తోంది వైజయంతీ బ్యానర్. సీతారామం సినిమా ఈ బ్యానర్ నుంచే వచ్చింది. దాంతో ఈ కాంబినేషన్ దాదాపుగా ఫిక్స్ అయిపోయినట్టేనని అంటున్నారు. అతి త్వరలోనే ఈ ప్రాజెక్ట్ నుంచి అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ కమిట్ అయిన సినిమాలు అయిపోగానే.. ఈ క్రేజీ కాంబో ఉంటుందని అంటున్నారు. మరి ప్రభాస్ మార్కెట్ ని ప్రేమ కథలు ఎంత వరకూ మ్యాచ్ చెయ్యగలవు అనేది చూడాలి.