సాధారణంగా ఇండియాలో ఒక సినిమాలోని పాత్రలను, పోస్టర్లను తమ బిజినెస్ పెంచుకోవడానికి కొన్ని షాపుల వారు వాడుతూ ఉంటారు. అది అందరికీ తెలిసిన విషయమే.. పార్లర్ల ముందు హీరోయిన్ ఫోటోలు, కటింగ్ షాపుల ముందు హీరోల పోస్టర్లు చూస్తూనే ఉంటాం. అందులో తప్పేమి లేదు కూడా.. అయితే ఇంతకన్నా దారుణంగా ఒక పాకిస్థాన్ రెస్టారెంట్ ప్రమోషన్ చేసింది.. అందులోనూ ఒక నటిని అవమానిస్తూ వారు చేసిన పనికి నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ నటించిన గంగూభాయ్ కతీయవాడి సినిమా ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయినా ఈ సినిమా రికార్డు కలెక్షన్ రాబట్టి 100 కోట్ల క్లబ్ లో చేరింది.
ఇక ఈ చిత్రంలో అలియా ఒక వేశ్యగా నటించిన విషయం విదితమే.. హీరోయిన్ అవుదామని సిటీకి వచ్చిన ఒక యువతి అనుకోని పరిస్థితిలో వేశ్యగా మారడం, ఆ తరువాత ఆ వేశ్యా వాటికకు లీడర్ గా మారి వారి జీవితాలను మార్చడం లాంటివి ఎంతో అద్భుతంగా చూపించాడు దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ. ఇక ఇందులో అలియా వేశ్యగా మారి కస్టమర్లను పిలుస్తున్న ఒక సీన్ ను తీసుకొని ఒక పాకిస్తాన్ రెస్టారెంట్ యాడ్ చేసింది.. స్వింగ్ అనే ఆ రెస్టారెంట్ కస్టమర్లను పెంచుకోవడానికి అలియా సీన్ ను వాడేసింది. సోమవారం రోజు పురుషులకు ప్రత్యేకమైన ఆఫర్ ఉంది రండి అన్నట్లు అలియా పిలుస్తూ ఉండడం, దాన్ని చూసి మగవారు నవ్వుతూ రావడం చూపిస్తూ ప్రకటన డిజైన్ చేశారు. ఇక ఈ ప్రకటన ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇలాంటి నీచమైన ఐడియాలు మీకు తప్ప మరెవ్వరికీ రావు.. ఒక నటిని అంత దారుణంగా అవమానించడం దారుణమని, ఆ రెస్టారెంట్ పై తగిన చర్యలు తీసుకోవాలని అలియా ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.