శరత్ బాబు, కమల్ హాసన్ కలసి అనేక చిత్రాలలో నటించారు. వాటిలో కె.విశ్వనాథ్ దర్శకత్వంలో రూపొందిన “సాగరసంగమం, స్వాతిముత్యం” చిత్రాలు కూడా ఉన్నాయి. ఈ రెండు చిత్రాలలో కమల్ హాసన్ అభినయం చూసి మన దేశంలో నటనకు ‘ఆస్కార్ అవార్డ్’ అంటూ వస్తే అది కమల్ తోనే మొదలవుతుంది అంటూ శరత్ బాబు అనేవారు. ఆ మాటను కె.విశ్వనాథ్ సైతం బలపరిచారు. అలా కమల్ కు ఆస్కార్ అంటూ అప్పట్లో సినిమా పత్రికల్లో ఆకర్షణీయమైన కథనాలు ప్రచురితమయ్యాయి.
‘సాగరసంగమం, స్వాతిముత్యం’ చిత్రాలకు ముందే కమల్ హాసన్ కు ‘మూండ్రం పిరై’తో 1983లో ఉత్తమ నటునిగా నేషనల్ అవార్డు లభించింది. ఆ తరువాత మణిరత్నం తెరకెక్కించిన ‘నాయకన్’తో రెండోసారి జాతీయ స్థాయిలో ఉత్తమనటునిగా కమల్ హాసన్ నిలిచారు. మూడోసారి శంకర్ ‘భారతీయుడు’తో బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు సొంతం చేసుకున్నారు కమల్. ఉత్తమనటునిగా మూడుసార్లు నేషనల్ అవార్డు అందుకున్న తొలి నటునిగా కమల్ రికార్డ్ సృష్టించారు. ఈ నేపథ్యంలో మరోమారు తన మిత్రుడు కమల్ హాసన్ కు ‘ఆస్కార్’ రావాలని శరత్ బాబు అభిలషించారు. అయితే అప్పట్లో మన సినిమాలను ఆస్కార్ బరిలో జనరల్ కేటగిరీలో నిలపడానికి ఇప్పటిలా నిబంధనలు సులువుగా లేవు. అందువల్ల శరత్ కోరుకున్నట్టుగా కమల్ కు అప్పుడు ఆస్కార్ కు ఆస్కారం కలుగలేదు. పైగా కమల్ హాసన్ సైతం ఆస్కార్ అవార్డులు అన్నవి కేవలం హాలీవుడ్, బ్రిటన్ సినిమాలకు పరిమితమని, మన ఆస్కార్లు నేషనల్ అవార్డులేనని అభిప్రాయపడ్డారు. ఏది ఏమైనా శరత్ బాబు కోరుకున్నట్టు ఇప్పుడు ఆస్కార్ అవార్డుల్లో జనరల్ కేటగిరీలోనూ ఎంట్రీ పొందే అవకాశం సుగమమైంది. ఈ నేపథ్యంలో శరత్ బాబు కోరుకున్నట్టుగా జరుగుతుందేమో చూడాలి!