వైవిధ్యమైన పాత్రలు, చిత్రాలతో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నాడు యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ విశ్వక్ సేన్. 2020లో వాలెంటైన్స్ డేన తమిళంలో విడుదలై విజయం సాధించిన ‘ఓ మై కడవులే’ మూవీ తెలుగు రీమేక్ ‘ఓరి దేవుడా’లో విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్నాడు. మిథిలా పాల్కర్, ఆశా భట్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీలో విక్టరీ వెంకటేశ్ ఓ కీలక పాత్ర పోషించాడు. మాతృకను డైరెక్ట్ చేసిన అశ్వత్ మారిముత్తునే తెలుగులోనూ తీస్తున్నాడు. పీవీపీ సినిమా బ్యానర్ పై నిర్మితమౌతున్న ఈ సినిమాకు దిల్ రాజు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు తరుణ్ భాస్కర్ మాటలను అందిస్తుండగా, లియోన్ జేమ్స్ సంగీత సారథ్యం వహించారు. విదు అయ్యన్న సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్న ఈ చిత్రానికి వంశీ కాకా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్.
స్పెషల్ సర్ ప్రైజ్ గా ఈ మూవీలోని వెంకటేశ్ లుక్ ను బుధవారం రివీల్ చేయడంతో పాటు డైలాగ్స్ లేకుండా ఓ గ్లిమ్స్ ను రిలీజ్ చేశారు. అంతేకాదు… అక్టోబర్ 21న ఈ మూవీని గ్రాండ్ గా విడుదల చేయబోతున్నట్టు తెలిపారు. దేవుడికి సంబంధించిన లవ్ కోర్టులో వెంకటేశ్ ఓ కేసు పుస్తకాన్ని తీసుకుని కూర్చోగానే, ఆ గదిలోకి రకరకాల సందేహాల నడుమ హీరో విశ్వక్ సేన్, అతని స్నేహితుడు రాహుల్ రామకృష్ణ సంశయంగా అడుగుపెట్టడం ఈ గ్లిమ్స్ లో ఉంది. డైరెక్టర్ అశ్వత్ మారిముత్తు తెలుగు నెటివిటీకి తగ్గట్లు కథలో మార్పులు చేర్పులు చేశారని తెలుస్తోంది. విశేషం ఏమంటే… వెంకటేశ్ గత యేడాది తమిళ రీమేక్ ‘నారప్ప’, మలయాళ రీమేక్ ‘దృశ్యం 2’లో నటించాడు. ఈ యేడాది ఆయన నటించిన ‘ఎఫ్ 3’ విడుదలైంది. ఇప్పుడు మరో తమిళ రీమేక్ ‘ఓరి దేవుడా’ దీపావళి కానుకగా అక్టోబర్ 21న రిలీజ్ కాబోతోంది. అలానే హీరో విశ్వక్ సేన్ కూ ఈ యేడాది ఇది రెండో సినిమా. ఇప్పటికే అతను నటించిన ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ విడుదలైంది.