DJ Tillu Sequel :
DJ’డిజె టిల్లు’ సినిమాతో తనకంటూ ఓ స్పేస్ క్రియేట్ చేసుకున్నాడు యువ హీరో సిద్ధు జొన్నలగడ్డ. ఈ ఏడాది ఫిబ్రవరిలో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. దాంతో ఈ సక్సెస్ ను ఎన్ క్యాష్ చేసుకోవాలనే ఉద్దేశంతో జూన్ లో సీక్వెల్‌ను ప్రకటించారు. ‘డిజె టిల్లు’కు స్క్రిప్ట్ విషయంలో చేయిచేసుకున్న హీరో సీక్వెల్ కోసం దర్శకుడు విమల్ కృష్ణతో చేతులు కలిపాడు. ఆగస్ట్‌లో షూటింగ్ మొదలు కాబోతున్న తరుణంలో ఊహించని విధంగా ఈ సినిమా నుంచి దర్శకుడు తప్పుకున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఫిల్మ్ నగర్ సమాచారం ప్రకారం హీరో సిద్ధు జొన్నలగడ్డతో డిఫరెన్సెస్ వల్లనే దర్శకుడు విమల్ సీక్వెల్ నుండి తప్పుకున్నట్లు వినికిడి.
నిజానికి ‘డిజె టిల్లు’ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా సక్సెస్ క్రెడిట్ సిద్ధు కి కట్టబెడుతూ పలు కథనాలు వెలువడ్డాయి. అయితే సీక్వెల్ ప్రకటనతో అవేవీ నిజం కాదని అంతా సమష్టి కృషి అని భావించారు. కానీ సీక్వెల్ వర్క్ స్టార్ట్ అయిన తర్వాత దర్శకుడు విమల్, హీరో సిద్దూ మధ్య పలు క్రియేటివ్ డిఫరెన్సెస్ చోటు చేసుకున్నాయట. సిద్దు బిహేవియర్ తో హర్ట్ అయి ఉన్న దర్శకుడు విమల్ ఆ ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు హీరో సిద్ధూ జొన్నలగడ్డనే సీక్వెల్ ను భుజంపై వేసుకుని ముందుకు నడిపిస్తున్నాడట. విమల్ స్థానంలో మరో దర్శకుడు ఎంట్రీ ఇచ్చినా అన్నీ తానై వ్యవహరిస్తున్నాడటం సిద్ధూ. అయితే ఇక్కడో చిక్కు ఉంది. ఈ సీక్వెల్ ఏమైనా అటు ఇటు అయితే ‘డిజె టిల్లు’ సక్సెస్ మొత్తం దర్శకుడు విమల్ దే అని తేలిపోతోంది. దీంతో సిద్ధూ ఎలాగైనా ఈ సీక్వెల్ ను హిట్ బాట పట్టించాలని తంటాలు పడుతున్నాడట. త్వరలోనే కొత్త దర్శకుడు పేరు ప్రాజెక్ట్ ఇతర వివరాలు వెల్లడి కానున్నాయి. ఇక ఈ సీక్వెల్ లో నేహాశెట్టి, ప్రిన్స్, బ్రహ్మాజీ ముఖ్య పాత్రలు పోషించనున్నారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై నాగవంశీ ఈ సినిమాను నిర్మించనున్నారు. ఇదిలా ఉంటే విమల్ కృష్ణ నాగచైతన్యతో మూవీ కోసం కథ సిద్ధం చేస్తున్నాడు. ఇప్పటికే ఓ నేరేషన్ వినిపించాడట. దర్శకుడు మార్పు విషయమై యూనిట్ మాత్రం పరస్పర అంగీకారంతోనే ముందుకు వెళుతున్నట్లు తెలియచేస్తోంది. ఏది ఏమైనా సిద్దూ జొన్నలగడ్డ ముందు సక్సెస్ టాస్క్ ఉంది. మరి దానిని సక్సెస్ ఫుల్ గా అధిగమిస్తాడా? లేదో చూడాలి.