No Buzz On Nayanthara Connect Movie: నయనతార తదుపరి చిత్రం ‘కనెక్ట్’ 22న థియేటర్‌లలో విడుదల కానుంది. అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యరాజ్, అనుపమ్ ఖేర్, వినయ్ రాజ్ ఇతర ముఖ్య పాత్రధారులు. తమిళంలో తమ సొంత సంస్థ రౌడీ పిక్చర్స్ పతాకంపై నయన్ భర్త విఘ్నేష్ శివన్ నిర్మించారు. తెలుగులో దీనిని యువీ క్రియేషన్స్ సంస్థ విడుదల చేస్తోంది. ఈ హారర్ థ్రిల్లర్ సినిమా నిడివి గంటన్నర మాత్రమే. మధ్యలో ఇంటర్వెల్ కూడా ఉండదని దర్శకుడు స్పష్టం చేశాడు. అయితే ఇలా ఇంటర్వెల్ లేక పోవడం తమ థియేటర్లలోని క్యాంటిన్ ఆదాయానికి గండి పడుతుందనే ఆందోళనలో ఉన్నారు ప్రదర్శనదారులు. దీంతో ఈ సినిమా విడుదలకు ఎక్కువ మంది ముందుకు రావట లేదట. తమిళనాడులో అయితే దాదాపు సగం థియేటర్లు ఇంకా రిలీజ్ చేసే విషయంలో ఊగిసలాడుతూనే ఉన్నాయట.
తెలుగు రాష్ట్రాలలో యువి క్రియేషన్స్ విడుదల చేస్తోంది కావబట్టి ఎలాంటి ఇబ్బంది ఎదురుకావటం లేదు. తమిళంలో మాత్రం సినిమా విడుదల కోసం ఎగ్జిబిటర్ల తో సంప్రదింపులు కొనసాగుతున్నాయి. దీనికి తోడు నయనతార ప్రచారానికి రాకపోవడం కూడా మైనస్ గా మారింది. నయన్ కి తమిళంలో మార్కెట్ ఉన్నా… తెలుగులో మాత్రం అంత మార్కెట్ లేదు. స్టార్ హీరో ఉన్న సినిమాకు అయితే నయన్ ప్లస్ అవుతుందేమో కానీ తనే సినిమా మొత్తం మోయాలంటే మాత్రం వర్కవుట్ కావటం లేదు. అందుకు ఇంతకు ముందు విడుదలైన సినిమాలే నిదర్శనం. మరి ఇకనైనా తగ్గిన తన ఇమేజ్ ను, క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని వైఖరి మార్చుకుని ప్రచారంలో పదనిసలు పలుకుతుందేమో చూడాలి.