కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అక్టోబర్ 29న కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన అభిమానులు ఇప్పటికీ ఆ బాధ నుంచి తేరుకోలేకపోతున్నారు. అయితే తాజాగా ఓ నెటిజన్ పునీత్ పై చేసిన పిచ్చి పనికి చేతికి సంకెళ్లు వేయించుకోవాల్సి వచ్చింది. దివంగత కన్నడ నటుడు పునీత్ రాజ్ కుమార్‌పై సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన సందేశాన్ని పోస్ట్ చేసిన యువకుడిని బెంగళూరు నగర సైబర్ క్రైమ్ విభాగం పోలీసులు అరెస్టు చేశారు. నటుడు శుక్రవారం గుండె పోటుతో మరణించారు. బెంగళూరు నగర పోలీసు కమిషనర్ కమల్ పంత్ మాట్లాడుతూ “ఒక యువకుడిని అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు ప్రారంభించాము. సైబర్ టీమ్ దీనిపై విచారణ జరుపుతోంది” అని తెలిపారు. అరెస్టయిన యువకుడికి సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించలేదు.
Read Also : సమంత కోసం నిర్మాతగా స్టార్ హీరోయిన్
పునీత్ ఆకస్మిక మరణానికి కర్ణాటక మొత్తం సంతాపం వ్యక్తం చేస్తుంటే, నిందితుడు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో బీర్ బాటిల్‌తో అవమానకరమైన పోస్ట్‌ను అప్‌లోడ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడమే కాకుండా, ఆ వ్యక్తి బెంగళూరు నగర పోలీసులను ట్యాగ్ చేసి చేయడం గమనార్హం. ఈ పోస్ట్ గురించి పునీత్ అభిమానులు పోలిసుల దృష్టికి తేవడంతో వెంటనే పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పునీత్ మృతి నేపథ్యంలో నగరంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యగా బెంగళూరు పోలీసులు ఆదివారం వరకు మద్యం విక్రయాలను నిషేధించారు. నెటిజన్ పోస్టుకు ఇదే కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. ఇక 46 ఏళ్ల పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు ఆదివారం బెంగళూరులో పూర్తిగా ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి.