NBK107 సినిమా సెట్స్ మీదకి వెళ్లినప్పటి నుంచి దసరాకే రిలీజ్ కానుందని ప్రచారం జరుగుతూ వస్తోంది. చిత్రీకరణ కూడా గ్యాప్ లేకుండా శరవేగంగా జరుగుతుండడంతో.. ఈ సినిమా దసరాకి రావడం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ, ఇప్పుడు దసరాకి సినిమా రాకపోవచ్చని సమాచారం. ఇందుకు కారణం.. బాలయ్యకి కరోనా సోకడమే! ఇటీవల టెస్టులు నిర్వహించగా.. బాలయ్యకి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో.. షూటింగ్ వాయిదా వేయాల్సి వచ్చింది. ఇది తదుపరి షెడ్యూల్స్‌పై కూడా ప్రభావం చూపింది. తద్వారా దసరా లోపు పనులు ముగించడం కష్టమని తేలడంతో, మరో తేదీపై మేకర్స్ కన్నేశారు.
ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. డిసెంబర్ 2వ తేదీన NBK107ను రిలీజ్ చేయాలని మేకర్స్ యోచిస్తున్నారట! ఈ తేదీపైనే మేకర్స్ కన్నేయడానికి ఓ కారణం ఉంది. గతేడాదిలో అదే రోజున బాలయ్య నటించిన ‘అఖండ’ సినిమా వచ్చింది. అప్పుడు కరోనా ప్రభావం ఇంకా ఉన్నా, ఏపీలో టికెట్ రేట్లు తక్కువగా ఉన్నా.. ఆ ప్రతికూలతల్ని ఎదుర్కొని ఆ చిత్రం అఖండమైన విజయం సాధించింది. బాలయ్యతో పాటు బోయపాటి శ్రీను కెరీర్లోనే బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. ఆ బ్లాక్‌బస్టర్ సెంటిమెంట్ కలిసొస్తుందన్న ఉద్దేశంతో.. తమ NBK107ను డిసెంబర్ 2న విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారట! అయితే, దీనిపై ఇంకా అధికార ప్రకటన రావాల్సి ఉంది.
కాగా.. బాలయ్య, గోపీచంద్ మలినేని కాంబోలో వస్తున్న ఈ చిత్రంలో శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. ఇందులో విలన్‌గా దునియా విజయ్ నటిస్తుండగా, ఓ కీలక పాత్రలో వరలక్ష్మి శరత్‌కుమార్ నటిస్తోంది. ఈ చిత్రానికి ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. ‘అఖండ’తో అటు బాలయ్య, ‘క్రాక్’తో ఇటు గోపీచంద్ ఘనవిజయాలు సాధించిన తర్వాత చేస్తోన్న సినిమా కావడంతో.. NBK107పై భారీ అంచనాలే నెలకొన్నాయి.