విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నటరత్న యన్.టి.రామారావు అని అభిమానులు ఆ విఖ్యాత నటుణ్ణి ఆరాధించేవారు. కొందరు కొంటె కోణంగులు అప్పట్లో ‘విశ్వం’ అంటే ‘ఆంధ్రప్రదేశా?’ అంటూ గేలిచేశారు. అయితే నిజంగానే యన్టీఆర్ తన నటనాపర్వంలోనూ, రాజకీయ పర్వంలోనూ అనేక చెరిగిపోని, తరిగిపోని రికార్డులు నెలకొల్పి, ప్రపంచ ప్రఖ్యాతి గాంచారు. ముందు నవ్వినవారే, తరువాత ‘విశ్వవిఖ్యాత’ అన్న పదానికి అసలు సిసలు న్యాయం చేసిన ఏకైన నటరత్నం అని కీర్తించారు! అదీ యన్టీఆర్ సాధించిన ఘనత! ఆయన ఏ నాడూ రికార్డులు నెలకొల్పాలని, బద్దలు చేయాలని భావించలేదు. తన దరికి చేరిన పాత్రలు పోషించుకుంటూ వెళ్ళారు. అరుదైన విజయాలు ఆయనను వెదుక్కుంటూ వచ్చాయి. తెలుగునాట గోల్డెన్ జూబ్లీ హిట్స్ లో తనదైన రికార్డ్ నెలకొల్పిన యన్టీఆర్, ఆ పై మరో అరుదైన రికార్డునూ సొంతం చేసుకున్నారు. అదేమిటంటే, తెలుగు, తమిళ, హిందీ భాషల్లో గోల్డెన్ జూబ్లీస్ చూసిన నటునిగా చరిత్ర సృష్టించారు.
తెలుగులో యన్టీఆర్ నటించిన “పాతాళభైరవి, లవకుశ, అడవిరాముడు, వేటగాడు, బొబ్బిలిపులి” చిత్రాలు స్వర్ణోత్సవాలు చూశాయి. తమిళంలో యన్టీఆర్ శ్రీరామునిగా నటించిన ‘సంపూర్ణ రామాయణం’ (1958) చిత్రం డైరెక్ట్ గా 264 రోజులు ప్రదర్శితమై, షిఫ్ట్ పై 101 రోజులు ఆడి, మొత్తం 365 డేస్ పూర్తి చేసుకొని గోల్డెన్ జూబ్లీ చూసింది. ఇక హిందీలో యన్టీఆర్ నటించిన ‘నయా ఆద్మీ’ (1956) చిత్రం 42 వారాలు డైరెక్ట్ గా ప్రదర్శితమై తరువాత షిఫ్ట్ పై గోల్డెన్ జూబ్లీ జరుపుకుంది. ఇలా మూడు భాషల్లోనూ ‘స్వర్ణోత్సవాలు’ చూసిన మొట్టమొదటి నటునిగా యన్టీఆర్ చరిత్రలో నిలచిపోయారు.