పాపులర్ స్టాండ్ అప్ కమెడియన్ మునావర్ ఫారూఖీకి మరో షాక్ తప్పలేదు. జనవరి 9న హైదరాబాద్ లో జరగాల్సిన ఆయన షో రద్దు అయ్యింది. తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్-19 కేసుల పెరుగుదల కారణంగా మరో రెండు మూడు రోజుల్లో జరగాల్సిన స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారూఖీ షో రద్దు అయ్యింది. కొత్త కోవిడ్ మార్గదర్శకాలలో, 250 మందికి పైగా ఒకే దగ్గర గుమిగూడడం నిషేధం కాబట్టి ‘ధంధో’ షో రద్దు అయ్యిందనే విషయాన్నీ సోషల్ మీడియాలో మునావర్ ఫారూఖీ ధృవీకరించారు. అంతకుముందు తెలంగాణ పరిశ్రమలు, సమాచార సాంకేతిక శాఖ మంత్రి కేటీఆర్ కూడా ఫారూఖీని సపోర్ట్ చేశారు. ఇక ఫారూఖీ కూడా హైదరాబాద్‌లో ప్రదర్శన ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.
Read Also : బాలీవుడ్ కనెక్షన్స్ కోసం సామ్ ప్రయత్నాలు ?
కర్నాటకలోని బిజెపి ప్రభుత్వాన్ని ఎద్దేవా చేస్తూ కేటీఆర్ “మా నగరంలో స్టాండ్ అప్ కమెడియన్‌లకు బహిరంగ ఆహ్వానం లభిస్తుంది. మేము మునావర్ ఫారూఖీ, కునాల్ కమ్రాలకు రాజకీయంగా పొత్తులో లేదు కాబట్టి వారి ప్రదర్శనలను రద్దు చేయము” అని అన్నారు. బెంగళూరులో మునావర్ ఫారూఖీ షో ‘డోంగ్రీ టు నోవేర్’ రద్దుపై స్పందించిన కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు శాంతిభద్రతల సమస్యల కారణంగానే ఈ షోను రద్దు చేసినట్టు స్థానిక పోలీసులు తెలిపారు.
హైదరాబాద్‌లో మునావర్ ఫారూఖీ షో ప్రకటించిన వెంటనే తెలంగాణలోని బీజేపీ నేతలు బెదిరింపులకు దిగారు. డిసెంబర్ 25న రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ భారతీయ జనతా యువమోర్చా (బీజేవైఎం)ని ప్రదర్శనను నిలిపివేయాలని కోరారు. నిజామాబాద్‌కు చెందిన బీజేపీ ఎంపీ డి.అరవింద్ కూడా స్పందిస్తూ హైదరాబాద్‌లో ఫరూఖీ షోను అనుమతించబోమని చెప్పారు. కేటీఆర్‌కు, ఆయన తండ్రి కేసీఆర్‌కు హిందూ సమాజం కామెడీగా మారిందా ? అని ప్రశ్నించారు. ఇక బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఆ షోను అడ్డుకుంటామని ప్రకటించారు.
Read Also : “పుష్ప”రాజ్ కోసం అమెజాన్ ఎంత చెల్లించిందో తెలుసా?
అసలు మునావర్ ఫారూఖీ ఎవరు?
స్టాండ్ అప్ కమెడియన్, రచయిత, రాపర్ అయిన మునావర్ ఫారూఖీ గుజరాత్‌లో జన్మించారు. 2007లో ఆయన, ఆయన కుటుంబం ముంబైలోని డోంగిరికి మారారు. 17 సంవత్సరాల వయస్సులో ఫారూఖీ పని చేయడం ప్రారంభించాడు. మొదట పాత్రల దుకాణంలో ఉద్యోగిగా, ఆపై గ్రాఫిక్ డిజైనర్‌గా చేశాడు. 2017లో స్టాండ్ అప్ కమెడియన్‌గా తన కెరీర్‌ను ప్రారంభించాడు. 29 ఏళ్ల కమెడియన్‌కు ట్విట్టర్‌లో 1.29 లక్షల మంది, ఇన్‌స్టాగ్రామ్‌లో 7.79 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.
నవంబర్ 28న బెంగుళూరులో తన ప్రదర్శన రద్దు చేయబడిన తర్వాత ఫారూఖీ సోషల్ మీడియాలో “గత రెండు నెలల్లో బెదిరింపుల కారణంగా మేము 12 షోలను రద్దు చేసాము. ఇది ముగింపు అని నేను భావిస్తున్నాను” అంటూ సంచలన ట్వీట్ చేశాడు. ఫారూఖీ గత నెలలో కొన్ని మితవాద సంస్థల నిరసనల మధ్య కర్ణాటక రాజధాని బెంగుళూరులో ఒక ప్రదర్శనను నిర్వహించడానికి అనుమతి నిరాకరణ తప్పలేదు. అంతేకాదు ఫారూఖీ తన షో ద్వారా మతపరమైన మనోభావాలను దెబ్బతీశాడని ఆరోపిస్తూ 2021 జనవరిలో బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన తర్వాత ఫారూఖీ ఇండోర్‌లో ఒక నెల జైలు జీవితం గడిపారు.