Month Of Madhu: పెళ్లి తరువాత కలర్స్ స్వాతి ఇప్పుడిప్పుడే రీ ఎంట్రీ ఇస్తోంది. ఇక తాజాగా స్వాతి, నవీన్ చంద్ర జంటగా నటించిన చిత్రం మంత్ ఆఫ్ మధు. శ్రీకాంత్ నాగోటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను క్రిష్వీ ప్రొడక్షన్స్ హ్యాండ్ పిక్డ్ స్టోరీస్ బ్యానరన్ పై యశ్వంత్ ములుకుట్ల నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి ఒక అప్డేట్ కానీ, పోస్టర్ కానీ వచ్చింది లేదు.. తాజాగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేసి అభిమానులకు షాక్ ఇచ్చారు. టీజర్ ఆద్యంతం ఆకట్టుకొంటుంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో భార్యాభర్తల మధ్య జరిగిన ఒక కథ అని టీజర్ ను బట్టి తెలుస్తోంది. ఒక గ్రామంలో మధు అనే తాగుబోతును స్వాతి ప్రేమించి పెళ్లి చేసుకొంటుంది. పెళ్లి తరువాత అతడిని మార్చడానికి ప్రయత్నం చేసి విఫలమవుతోంది. దీంతో అతడి నుంచి విడిపోవాలని రోడ్డెక్కుతోంది.
ఇక కోర్టులో ఈ జంటకు విడాకులు వస్తాయా..? అసలు మధు తాగుబోతుగా మారడానికి కారణాలు ఏంటి..? చివరకు భార్య కోసం అతను మారాడా..? లేదా..? అనేది కథగా తెలుస్తోంది. ప్రస్తుతం సమాజంలో ప్రతి ఒక్క మహిళ పడే బాధను ఎంతో సున్నితంగా చూపించాడు దర్శకుడు. భార్యభర్తల మధ్య గొడవలు, అలకలు.. భర్తను మార్చుకొనే ప్రయత్నంలో అలిసిపోయిన భార్య.. ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న వారి జీవితంలో ఎదుర్కున్న సమస్యలను ఈ సినిమాలో చూపించినట్లు తెలుస్తోంది. ఇక మధు గా నవీన్ చంద్ర, అతని భార్యగా స్వాతి నటన ఎంతో న్యాచురల్ గా ఉంది. అచ్చు రాజమణి సంగీతం ఆకట్టుకొంటుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో స్వాతి రీ ఎంట్రీ హిట్ ను అందుకుంటుందేమో చూడాలి.