Megastar Chiranjeevi: గోవా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో చిరంజీవి అత్యంత గౌరవప్రదమైన అవార్డును అందుకున్నారు. కేంద్రమంత్రులు అనురాగ్ ఠాకూర్, మురుగన్ చేతుల మీదుగా ఇండియన్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2022 అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా చిరు ఎమోషనల్ స్పీచ్ నెట్టింట వైరల్ గా మారింది. కొణిదెల శివశంకర వరప్రసాద్ నుంచి మెగాస్టార్ గా మారిన ఆయన జర్నీ గురించి చెప్పుకొచ్చారు. ఇక ఎప్పటికి సినిమాల్లోనే ఉంటాను అంటూ వేదిక సాక్షిగా అభిమానులకు ప్రామిస్ చేశారు. తనను ఇక్కడ నిలబెట్టింది అభిమానులే అని తెలిపి ఆయన ప్రేమను చూపించారు.
ఇక అంతా బాగానే ఉన్నా ఆయన రాజకీయాల గురించి దాటివేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. అవార్డు తీసుకొని కిందకు వెళ్ళడానికి రెడీ అవుతున్న చిరును కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ఆపి.. ఒక ప్రశ్న వేశారు. “మళ్లీ రాజకీయాల్లోకి వెళ్లే ఉద్దేశ్యం ఉందా..? ప్రజలు మరోసారి మిమ్మల్ని ఆదరిస్తారా..? అని అడుగగా అందుకు చిరు సమాధానాన్ని దాటి వేస్తూ ” మనం తరువాత మాట్లాడుకుందాం సర్” అంటూ వెళ్లిపోయారు. ఆయన అడిగేటప్పుడు వద్దు అన్నట్లు సైగలు చేయడం కూడా ఆ వీడియోలో కనిపిస్తోంది. దీంతో చిరు అన్నదానికి ఆంతర్యం ఏంటి అనేది తెలియాల్సి ఉంది. రాను అని నిర్మొహమాటంగా చెప్పొచ్చు కానీ మాట దాటివేయడం వెనుక ఉన్న మతలబు ఏంటా..? అని అభిమానులు ఆరా తీస్తున్నారు.