Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2022 అవార్డు దక్కిందన్న విషయం తెల్సిందే. ఇది కేవలం మెగాస్టార్ కు మాత్రమే దక్కిన విజయం కాదు. ఎన్నో ఏళ్లుగా టాలీవుడ్ మొత్తం ఎదురుచూస్తున్న విజయం. ఒకప్పుడు టాలీవుడ్ అంటే చిన్నచూపు చూసేవారని అప్పటి సీనియర్ హీరోలు ఎన్టీఆర్ నుంచి చిరు వరకు ఎన్నోసార్లు ఎన్నో స్టేజిలపై చెప్పారు. చిరు అయితే ఒకానొక సందర్భంలో తనకు జరిగిన అవమానాన్ని కూడా వివరించారు. “గతంలో గోవా ఫిల్మ్ ఫెస్టివల్ కు ఎన్ను వెళ్ళినప్పుడు అక్కడ ఎంతోమంది సినీ ప్రముఖుల ఫోటోలు కనిపించాయి.
అమితాబ్ బచ్చన్, రాజ్ కపూర్, జెమిని గణేశన్ లాంటి మహానుభావులు కనిపించారు.. కానీ ఎక్కడ తెలుగు హీరోలు అయిన ఎన్టీఆర్, ఏఎన్నార్ ఫోటోలు కనిపించలేదు. అది అక్కడ ఉన్న మన గుర్తింపు. తెలుగు పరిశ్రమకు అదే పెద్ద అవమానం అని అనిపించింది” అని ఎమోషనల్ అయ్యారు. ఇక ఇప్పుడు అదే ఫిల్మ్ ఫెస్టివల్ లో ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ గా అవార్డు అందుకోవడం తెలుగు చిత్ర పరిశ్రమకే గర్వకారణమని చెప్పుకొస్తున్నారు. ఎక్కడ అవమానించారో అక్కడే అందరి ముందు చిరుకు అవార్డును ప్రదానం చేయనున్నారు. ఇది కదా టాలీవుడ్ కు అసలైన విజయం అంటే అని కామెంట్స్ పెడుతున్నారు.