Vishwak Sen: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రం ‘దాస్ కా ధమ్కీ’ ఇటీవలే విడుదలైంది. ఈ పాన్ ఇండియా మూవీ కమర్షియల్ గా పెద్దంత సక్సెస్ సాధించకపోయినా స్వీయ దర్శకత్వంలో విశ్వక్ సేన్ దీన్ని నిర్మించడంతో పాటు డ్యుయల్ రోల్ ప్లే చేయడంతో మంచి పేరొచ్చింది. ఇదిలా ఉంటే విశ్వక్ సేన్ బర్త్ డే సందర్భంగా గత నెల మార్చి 29న ఓ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్ ప్రకటించింది. ఇప్పటికే ‘రౌడీ ఫెలో’, ‘ఛల్ మోహనరంగ’ చిత్రాలను తెరకెక్కించిన కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఈ మూవీని ప్రకటిస్తున్నట్టు తెలిపింది. దీన్ని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య… శ్రీకర స్టూడియోస్ తో కలిసి నిర్మిస్తున్నారు.
విశ్వక్ సేన్ నటిస్తున్న ఈ 11వ సినిమా రామానాయుడు స్టూడియోస్ లో పూజా కార్యక్రమాలతో బుధవారం మొదలైంది. స్టూడియోలోని కోవెల ముందు విశ్వక్ సేన్ పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు క్లాప్ నివ్వగా, నిర్మాత వెంకట్ బోయనపల్లి దర్శకత్వం వహించారు. దర్శకులు వెంకీ అట్లూరి, నిర్మాత రామ్ ఆచంట తమ చేతుల మీదుగా స్క్రిప్ట్ ని చిత్ర బృందానికి అందజేశారు. ఇందులో ఇద్దరు హీరోయిన్స్ కాగా అందులో ఒకరు అంజలి మరొకరు ‘డీజే టిల్లు’ ఫేమ్ నేహాశెట్టి. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లోని చీకటి సామ్రాజ్యం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఈ పిరియాడిక్ డ్రామా కోసం విశ్వక్ సేన్ మేకోవర్ చేయడం విశేషం. తన పాత్ర ఔచిత్యాన్ని తెలియచేస్తూ ఓపెనింగ్ లో విశ్వక్ సేన్ మీసం మెలేశాడు. ఈ ప్రారంభోత్సవానికి హీరోయిన్లలో ఒకరైన అంజలితో పాటు పలువురు నిర్మాతలు హాజరై చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. మే ప్రధమార్థంలో రెగ్యులర్ షూటింగ్ మొదలు కానున్న ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం సమకూర్చుతున్నారు. ఈ చిత్రానికి వెంకట్, గోపి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.