ఇండియన్ సినిమా చూసిన అద్భుతాలు… లివింగ్ లెజెండ్స్ మణిరత్నం-ఇళయరాజా. ఒకరేమో మూవీ మేకింగ్ మాస్టర్, ఇంకొకరు ఇండియాస్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్. ఇలాంటి ఇద్దరు టెక్నీషియన్స్ ఒకటే రోజున పుట్టడం, ఈ ఇద్దరూ సినిమాల్లోకి రావడం, కలిసి పని చేయడం సినిమా చేసుకున్న అదృష్టం. మణిరత్నం ఒక సూపర్బ్ సీన్ తెరకెక్కిస్తే చాలు, రాజా మ్యూజిక్ తో ఆడియన్స్ కి కట్టి పడేయడానికి రెడీగా ఉంటాడు. మణిరత్నం-ఇళయరాజా కలిసి చేసింది పది సినిమాలే కానీ పది సార్లూ అద్భుతాన్ని సృష్టించడం వీరికి మాత్రమే చెల్లింది. ఈ లెజెండ్స్ కాంబినేషన్ లో వచ్చిన గ్రేటెస్ట్ సినిమాలు ఏంటో ఒకసారి చూద్దాం.
మణిరత్నం-ఇళయరాజా కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా ‘పల్లవి అను పల్లవి’. 1983లో వచ్చిన ఈ సినిమా మ్యూజికల్ హిట్ గా నిలిచింది. కన్నడలో పల్లవి అను పల్లవి సినిమాతో మెప్పించిన మణి-రాజాలు సెకండ్ మూవీని మలయాళంలో ‘ఉనరు’ పేరుతో చేసారు. మోహన్ లాల్ హీరోగా నటించిన ఈ మూవీ అప్పటికి బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. కన్నడ, మలయాళం అయిపోయిన తర్వాత మొదటిసారి తమిళ్ లోకి అడుగు పెడుతూ 1985లో ‘పాగల్ నిలువు’ సినిమా చేసారు. ఈ సినిమాలో సాంగ్స్ హిట్ అయ్యాయి కానీ సినిమా మాత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఈ ఫ్లాప్ సినిమా నుంచి ఇమ్మిడియట్ గా బయటకి వచ్చి ‘ఇదయ కోవిల్’ సినిమాతో మణిరత్నం-ఇళయరాజాలు మ్యూజికల్ సెన్సేషన్ క్రియేట్ చేసారు. ఆ ఇయర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ఆల్బమ్ గా ఈ సినిమాకి పేరొచ్చింది. ఇదయ కోవిల్ సినిమాలోని ‘ఇదయం ఓరు కోవిల్’ అప్పటి తమిళ ప్రజలని ఒక ఊపు ఊపేసింది. మణిరత్నం-రాజాల ఎరా గ్రాండ్ గా మొదలయ్యింది ఇక్కడి నుంచే.
ఇదయ కోవిల్ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన మణిరత్నం-ఇళయరాజాలు నెక్స్ట్ ఒక ఆల్ టైం క్లాసిక్ ఇచ్చారు. ‘మౌన రాగం’ సినిమాతో మ్యూజిక్ లో ఒక కొత్త బెంచ్ మార్క్ ని సెట్ చేసింది ఈ కాంబో. మౌనరాగం సినిమాలోని ‘మల్లెపూల చల్లగాలి’ సాంగ్ తెలుగులో కూడా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. నేషనల్ అవార్డు అందుకున్న మౌనరాగం సినిమా కోలీవుడ్ ఆల్ టైం క్లాసిక్స్ లో ఒకటిగా నిలిచింది. ఈరోజుకి మౌనరాగం సినిమా కథ కథనం మ్యూజిక్ చాలా అడ్వాన్స్ గా ఉంటాయి. ప్రేమ కథల నుంచి గ్యాంగ్ స్టర్ డ్రామా వైపు వచ్చి మణిరత్నం చేసిన సినిమా ‘నాయకుడు’. కమల్ టెర్రిఫిక్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన ఈ మూవీకి ఇళయరాజా ఇచ్చిన మ్యూజిక్ ప్రాణం పోసింది. ఈ మూవీలో కేవలం సాంగ్స్ మాత్రమే కాదు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అద్భుతంగా ఉంటుంది. నాయకుడు సినిమా తెలుగు, తమిళ్ లోనే కాదు అన్ని ఇండియన్ భాషల్లో సూపర్ హిట్ అయ్యింది. ఇండియన్ టాప్ 10 బెస్ట్ మూవీస్ తీస్తే అందులో నాయకుడు టాప్ ప్లేస్ లో ఉండడం గ్యారెంటీ. నీ గూడు చెదిరింది, సందె పొద్దు మేఘం, కథ ముగిసింది లాంటి సాంగ్స్ ఈరోజుకి వినిపిస్తూనే ఉంటాయి.
నాయకుడు లాంటి సినిమా చేసిన తర్వాత ఏ దర్శకుడు అయినా మరో స్టార్ హీరోతో సినిమా చేస్తాడు కానీ మణిరత్నం తనకి ఎవరు సరిపోతారో వాళ్లతోనే సినిమా చేసాడు. కార్తీక్, ప్రభులని హీరోలుగా పెట్టి అగ్ని నక్షత్రం సినిమా చేసాడు. ఈ మూవీలోని ‘నిన్ను కోరీ వర్ణం’, రాజా రాజాధి రాజాధి రాజా’ సాంగ్ ఇప్పటి యూత్ కూడా వింటూనే ఉంటారు. ఇళయరాజా టాప్ సాంగ్ లో తప్పకుండా అగ్ని నక్షత్రం ఆల్బమ్ ఉంటుంది. కోలీవుడ్ లో 200 రోజులు ఆడిన ఈ సినిమా సాంగ్స్ ఒక సంవత్సరం పాటు అత్యధిక క్యాసెట్స్ అమ్ముడయ్యాయి.
మూడు బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ ఇచ్చిన తర్వాత స్ట్రెయిట్ తెలుగు సినిమా చేసారు మణిరత్నం-ఇళయరాజా. నాగార్జున హీరోగా వచ్చిన గీతాంజలి సినిమాకే కాదు మ్యూజిక్ కి కూడా క్లాసిక్ స్టేటస్ ఉంది. ఒక సినిమాలోని అన్ని పాటలు అద్భుతాలు చెయ్యడం తెలుగులో బహుశా అదే మొదటిసారి. ఈ సినిమాలోని అన్ని పాటలని ఎస్పీ బాలసుబ్రమణ్యం పాడడం విశేషం. గీతాంజలి తర్వాత మణి-రాజా కలిసి చేసిన సినిమా ‘అంజలి’. ఇది ఇండియా నుంచి అఫీషియల్ గా ఆస్కార్ కి ఎంట్రీ ఇచ్చిన సినిమా. ఇళయరాజా 500వ సినిమాగా బయటకి వచ్చిన అంజలి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కూడా మంచి పేరు తెచ్చుకుంది. ఇక ఈ కాంబినేషన్ లో వచ్చిన లాస్ట్ మూవీ ‘దళపతి’. రజినీకాంత్-మమ్ముట్టి హీరోలు, ఎస్పీ బాలు-ఏసుదాస్ సింగర్స్, సంతోష్ శివన్ సినిమాటోగ్రాఫర్, ఎడిటర్ గౌతమ్ రాజు… ఇలా సినిమా అంతా లెజెండ్స్ పేర్లే వినిపిస్తాయి. 1991లో వచ్చిన నాయకుడు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఆర్టిస్టుల మెస్మరైజింగ్ పెర్ఫార్మెన్స్, మణిరత్నం మాస్టర్ టేకింగ్… ఇలా అన్ని విషయాల్లో దళపతి సినిమా టాప్ ప్లేస్ లో ఉంటుంది. మణిరత్నం, ఇళయరాజాలు ఇద్దరూ నేషనల్ అవార్డ్స్ అందుకోని తన సుదీర్ఘ ప్రయాణానికి ఎండ్ కార్డ్ వేశారు. ఆ తర్వాత మణిరత్నం రెహ్మాన్ తో కంటిన్యూ అవుతూ ఉన్నాడు. ఈరోజుకీ మణిరత్నం-ఇళయరాజా కాంబినేషన్ కి లవర్స్ ఉన్నారు, ఈ కాంబో మళ్లీ సెట్ అయితే చూడాలి అని వెయిట్ చేస్తున్న వాళ్లూ ఉన్నారు. మరి ఆ అవకాశం మళ్లీ దక్కుతుందేమో చూడాలి.