సాధారణ ఎన్నికలను తలపించిన ‘మా’ ఎన్నికలు ముగిసి ఎట్టకేలకు మంచు విష్ణు అధ్యక్ష పదవిని చేపట్టే సమయం ఆసన్నమైంది. ఈరోజు ఉదయం ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ లో ‘మా’ ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను చేశారు. అంతకన్నా ముందు పూజాకార్యక్రమాలతో దేవుడి ఆశీస్సులు అందుకున్న మంచు విష్ణు బ్యాండ్ దరువుల మధ్య ప్రమాణ స్వీకారోత్సవ వేదిక దగ్గరకు వచ్చారు. ఈ కార్యక్రమానికి సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. కాగా 28 ఏళ్ళ చరిత్ర కలిగిన ‘మా’లో ఓ ఆనవాయితీ నడుస్తోంది. ఆ ఆనవాయితీని మంచు విష్ణు బ్రేక్ చేశారు. ఆ ఆనవాయితీ ఏంటంటే…
Read Also : ఎస్పీ బాలు ‘మా’ గీతంతో ప్రమాణ స్వీకారోత్సవం ప్రారంభం
సాధారణంగా ఎన్నికల అనంతరం ‘మా’ అధ్యక్షుడిగా ఎన్నికైన వాళ్ళు ముందుగా ప్రమాణ స్వీకారం చేసి, తరువాత ఛార్జ్ తీసుకుంటారు. కానీ విష్ణు మాత్రం ముందుగా ఛార్జ్ తీసుకుని, తరువాత ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొంటున్నారు. ఇంతకుముందు ఎన్నికైన ఏ అధ్యక్షుడు కూడా ఇలా ఆనవాయితీని బ్రేక్ చేయలేదు.
ఇక ఇదిలా ఉండగా ప్రకాష్ రాజ్ బృందం రాజీనామాలు చేసిన విషయం తెలిసిందే. ఆరోపణలు, ప్రత్యారోపణలు, సవాళ్లు, ప్రతి సవాళ్లతో విష్ణు, ప్రకాష్ రాజ్ మధ్య జరిగిన రాజకీయం చివరకు రాజీనామాల వరకు వెళ్ళింది. విష్ణు ప్యానల్ నుంచి 15 మంది గెలవగా, ప్రకాష్ ప్యానల్ నుంచి 11 మంది గెలిచారు. అయితే రెండు ప్యానళ్ల సభ్యులు కలిసి పని చేయలేరని, ఎన్నికల్లో అన్యాయం జరిగింది అంటూ ప్రకాష్ రాజ్ బృందం రాజీనామాలు చేసింది. అయితే రాజీనామాలు చేసిన వారి స్థానాల్లో ఎవరినైనా తీసుకునే అధికారం ‘మా’ అధ్యక్షుడికి ఉంటుంది. మరి ఇప్పుడు జరుగుతున్న పరిణామాల మధ్య విష్ణు ప్రకాష్ రాజ్ బృందం రాజీనామాలను ఆమోదిస్తారా ? లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.