మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి, పాపులర్ నటి పార్వతి ప్రధాన పాత్రధారులుగా మంగళవారం ‘పుళు’ పేరుతో ఓ సినిమా మొదలైంది. ఈ మూవీ ద్వారా రథీనా దర్శకురాలిగా పరిచయం అవుతోంది. మమ్ముట్టి తనయుడు, ప్రముఖ నటుడు దుల్కర్ సల్మాన్ సొంత బ్యానర్ లో ఈ మూవీని నిర్మిస్తుండటం విశేషం. నాలుగేళ్ళ క్రితం మమ్ముట్టి నటించిన ‘కసాబా’ మూవీలో ఆయన పోషించిన పాత్ర సెక్సిజమ్ ను ప్రోత్సహించేలా ఉందంటూ అప్పట్లో పార్వతి ఆరోపణలు చేసింది. దాంతో మమ్ముట్టి అభిమానులు ఆమెను సోషల్ మీడియాలో తీవ్రంగా విమర్శించారు. అయితే దుల్కర్ తో పార్వతికి చక్కని అనుబంధమే ఉంది. అతని చిత్రాలు ‘బెంగళూరు డేస్, చార్లీ’లో పార్వతి నటించింది. ఇప్పుడు దుల్కర్ నిర్మిస్తున్న సినిమాలో అతని తండ్రితో పాటే పార్వతి నటించడం మల్లూవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. ఈ తాజా చిత్రానికి హర్షద్, సుహాస్, షర్ఫూ రచన చేశారు. జాక్స్ బిజోయ్ సంగీతాన్ని అందిస్తుంటే, తెని ఈశ్వర్ సినిమాటోగ్రఫర్ గా చేస్తున్నాడు. మమ్మట్టి సరికొత్త గెటప్ తో మూవీ ముహూర్తానికి హాజరు కావడంతో అందరి దృష్టీ ‘పుళు’ సినిమా ప్రారంభోత్సవం పైనే పడింది.