Naresh V.K.: బాల నటుడిగా కెరీర్ ప్రారంభించిన విజయనిర్మల తనయుడు నరేశ్ కు ఇది గోల్డెన్ జూబ్లీ ఇయర్. ఈ సందర్భంగా తన తల్లికి చెందిన విజయకృష్ణా మూవీస్ బ్యానర్ లో ‘మళ్ళీ పెళ్ళి’ సినిమాను నిర్మిస్తున్నారు నరేశ్. ఇందులో ఆయన, పవిత్రలోకేష్ జంటగా నటిస్తున్నారు. ఇతర కీలక పాత్రలను వనిత విజయ్ కుమార్, అనన్య నాగళ్ళ, రవివర్మ, అన్నపూర్ణ, భద్రం, యుక్త, ప్రవీణ్ యండమూరి, మధు తదితరులు పోషిస్తున్నారు. కృష్ణ, విజయనిర్మల పాత్రలలో శరత్ బాబు, జయసుధ కనిపించబోతున్నారు. సీనియర్ నిర్మాత ఎం. ఎస్. రాజు రచన చేసి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఇదే నెల 26న తెలుగు, కన్నడ భాషల్లో విడుదల కాబోతోంది.
ఈ సందర్భంగా ‘మళ్ళీ పెళ్ళి’ సినిమాలోని మెలోడీ సాంగ్ ను బుధవారం విడుదల చేశారు. ‘కావేరి గాలిలా…. తాకేసి పోకలా…’ అంటూ సాగే ఈ పాటను అనంత్ శ్రీరామ్ రాయగా, నరేశ్ అయ్యర్ ఆలపించారు. దీనికి సురేశ్ బొబ్బిలి స్వరరచన చేశారు. దీనిని నరేశ్, పవిత్ర లోకేష్ పై చిత్రీకరించారు. నరేశ్ నిజజీవితంలోని సంఘటన నేపథ్యంలోనే ఈ సినిమా రూపుదిద్దుకునే భావన ఇప్పటి వరకూ విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ను చూస్తుంటే అర్థమౌతోంది. ఈ సినిమాకు అరుల్ దేవ్ సైతం సంగీతం సమకూర్చారు. ఎం.ఎన్. బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ, జునైద్ సిద్ధిక్ ఎడిటింగ్ మూవీకి హైలైట్ గా నిలుస్తాయని దర్శకుడు ఎం.ఎస్. రాజు చెబుతున్నారు. విడుదలకు ముందే హ్యూజ్ బజ్ ను క్రియేట్ చేసిన ‘మళ్ళీ పెళ్ళి’ని ఈ తరం ప్రేక్షకులు ఏమేరకు ఆదరిస్తారో చూడాలి.