ఇప్పటికి అన్ స్టాపబుల్ విత్ యన్బీకే
అంటూ ఆహా
ప్లాట్ ఫామ్ లో నటసింహ నందమూరి బాలకృష్ణ టాక్ షో పదిసార్లు అలరించింది. వాటిలో తొమ్మిది ఎపిసోడ్స్ భలేగా సాగాయి. వాటిలోని బెస్ట్ ను తీసుకొని పదో ఎపిసోడ్ గా రూపొందించి అలరించారు. ఇక పదకొండో ఎపిసోడ్ గా జనం ముందు నిలచిన అన్ స్టాపబుల్
ఫస్ట్ సీజన్ కు గ్రాండ్ ఫినాలే కావడం విశేషం!ఈ ఎపిసోడ్ ఇప్పటిదాకా వచ్చిన ఎపిసోడ్స్ అన్నిటికంటే మరింత విశేషమైనది. ఎందుకంటే తన తరం హీరోలలో ఎవరితోనూ టాక్ షో నిర్వహించని బాలయ్య, మొత్తం యంగ్ జనరేషన్ తోనే సాగారు. మొట్టమొదటి ఎపిసోడ్ లో మాత్రం తన సీనియర్ మోహన్ బాబుతో టాక్ షో నిర్వహించారు. అందులోనూ యంగ్ హీరో మంచు విష్ణు, మంచు లక్ష్మి పాల్గొనడం విశేషం. ఆ తరువాత నుంచీ అంతా యువరక్తమే! మధ్యలో బ్రహ్మానందం తనదైన హాస్యంతో అలరించినా, అక్కడా యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రత్యక్షం అయ్యారు.ఇలా అధిక శాతం యువకెరటాలతోనే బాలయ్య అన్ స్టాపబుల్ టాక్ షో సాగింది. గ్రాండ్ ఫినాలేలో పేరుకు తగ్గట్టుగానే ఈ తరం సూపర్ స్టార్ మహేశ్ బాబు అతిథిగా పాల్గొనడం విశేషం కాక మరేమిటి?
మహానటుడు యన్టీఆర్ తోనూ, తరువాత ఆయన నటవారసుడు బాలకృష్ణతోనూ మహేశ్ బాబు తండ్రి నటశేఖర కృష్ణ తన బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డారు. అలాగే బాలయ్య సైతం కృష్ణతోనూ, ఆయన తనయుడు మహే|శ్ తోనూ బాక్సాఫీస్ బరిలో సై అంటే సై అంటూ సాగారు. అందువల్ల నందమూరి నటవారసుడు నిర్వహించే కార్యక్రమంలో ఘట్టమనేని నటవారసుడు అతిథిగా పాల్గొనడం సినీ ఫ్యాన్స్ కు కన్నుల పండుగ లాంటిదే అని చెప్పాలి.
Read Also : భర్తను దారుణంగా అవమానించిన నెటిజన్… సింగర్ సునీత దిమ్మ తిరిగే కౌంటర్
ఈ గ్రాండ్ ఫినాలేలో బాలకృష్ణపై తయారు చేసిన ఏవీ ఆరంభంలోనే ఆకట్టుకుంది. అందులోని పదబంధాలు సైతం వినేవారికి, చూసేవారికి బంధాలు వేస్తాయి. ఇక ఎపిసోడ్ ఆరంభంలోనే బాలయ్య ప్రేక్షకుల నడుమ కూర్చుని ఇప్పటి దాకా సాగించిన టాక్ షోను పునశ్చరణ చేసుకోవడం మరింత ఆసక్తి కలిగిస్తుంది. మొదటి సారి టాక్ షో చేస్తున్నాను కొత్తగా ఉంటుందేమో అనుకున్నా...కానీ, ఇక్కడ కొచ్చాక నాకు నేనే కొత్తగా అనిపించా...
అని బాలయ్య చెప్పి ఆకట్టుకున్నారు. ఈ ఎపిసోడ్ లో మహేశ్ బాబును ఆహ్వానించే టప్పుడు బాలకృష్ణ పలికిన పలుకులను ఎవరు రాశారో కానీ, భగవద్గీత
అన్న మాట వినిపించడం అతిశయోక్తిగా అనిపించక మానదు.
ఎన్నెన్నో… అలరించే అంశాలూ…
అసలు మహేశ్ అంటే ఎవరు? అన్నప్రశ్నతో మహేశ్ తో టాక్ షో మొదలెట్టారు బాలకృష్ణ. అందుకు సమాధానంగా ఐ యామ్ ఏ ఫాదర్ టు మై చిల్డ్రన్
అని చెప్పడం ఆకట్టుకుంది. నీకూ నాకూ చాలా సిమిలారిటీస్ ఉన్నాయి
అని బాలయ్య చెప్పి వాటిని వర్ణించడమూ అలరిస్తుంది. ఈ సందర్భంగా మహేశ్ బాబు పి.ఆర్.వో అయిన బి.ఏ.రాజును తలచుకోవడమూ విశేషమనే చెప్పాలి. అందుకు మహేశ్ – బి.ఏ.రాజును రీప్లేస్ చేసే మనిషి లేర
ని చెప్పడమూ గమనార్హం! బి.ఏ.రాజు లేని లోటు పూడ్చలేనిదని మహేశ్ గుర్తు చేసుకున్నారు. చిన్నప్పుడు తనకు సెలవులు వస్తే చాలు, ఏదో ఒక సినిమాలో తన తండ్రి కృష్ణ నటింప చేసేవారని, అందుకోసం ఊటీ షెడ్యూల్ ప్లాన్ చేస్తూండేవారని మహేశ్ తెలిపారు. తన ఫస్ట్ సినిమా దాసరి రూపొందించిన నీడ
అని సెలవిచ్చారు మహేశ్. తాను ఎంత బిజీగా ఉన్నా, తన తండ్రి కుటుంబం కోసం ప్రత్యేకంగా టైమ్ కేటాయించేవారని, అందువల్ల ఆయనను మిస్ అయిన ఫీలింగే కలిగేది కాదని మహేశ్ ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. గౌతమ్, సితారలో ఎవరు క్యాట్? ఎవరు బ్ర్యాట్? అని బాలకృష్ణ అడగ్గానే, గౌతమ్ క్యాట్...సితార బ్ర్యాట్... తాట తీసేస్తుంది...
అని చెప్పగానే అక్కడున్న ప్రేక్షకులు గొల్లున నవ్వారు. సితార ఎప్పుడైనా అలుగుతుందా అన్నప్రశ్నకు, అలగక పోతే అడగాలి...
అంటూ మహేశ్ ఇచ్చిన సమాధానం కూడా ఆకట్టుకుంది. మార్కులు తక్కువ వస్తే ఏమిటి రియాక్షన్ అంటే ఆ సెక్షన్ పూర్తిగా తనది కాదని, అంతా తన భార్య నమ్రతనే చూసుకుంటుందని చెప్పారు మహేశ్. నీ సినిమా నచ్చక పోతే గౌతమ్ ఎలా రియాక్టవుతాడు? పాప ఎలా రియాక్టవుతుంది? అన్న ప్రశ్నకు – ఇప్పుడు పెద్దవారవుతున్నారు కదండీ... కాస్త చూసుకొని నటించాలి. నచ్చక పోతే, మొహం మీదే నచ్చలేదని చెబుతారు
అని తెలిపారు మహేశ్. తన తండ్రి కృష్ణ ఎప్పుడూ అల్లూరి సీతారామరాజు
సినిమా గురించి తమకు చెప్పేవారని, ఆ సినిమాను యన్టీఆర్ కు చూపించినప్పుడు ఆయన కూడా అభినందించారని తరచూ గుర్తు చేసుకొనేవారని మహేశ్ వివరించారు. చిన్నప్పుడు మహేశ్ నటించిన చిత్రాల్లోని ఫోటోస్ చూపిస్తూ సాగిన సంభాషణం కూడా ఆకట్టుకుంది. పెళ్ళికి కూడా పిలవలేదే అంటూ బాలయ్య అడగ్గానే, అప్పటి విశేషాలు వివరించారు మహేశ్.
వినోదంతో పాటు…
మధ్యలో డైరెక్టర్ అనిల్ రావిపూడి మహేశ్ గురించి మాట్లాడిన వీడియోను ప్లే చేశారు. అందులో సరిలేరు నీకెవ్వరు
సినిమా కాశ్మీర్ షెడ్యూల్ లో జరిగిన సంఘటన గురించి, సగం దాకా అనిల్ చెప్పారు. తరువాత కాశ్మీర్ లో ఏం జరిగిందో మహేశ్ బాబు వివరించారు. అది నవ్వుల పువ్వులు పూయించింది. ఆ సమయంలో బాలయ్య కూడా ముద్దుల మొగుడు
సినిమా గురించి గుర్తు చేసుకొని మురిపించారు. తరువాత మెహర్ రమేశ్ బొంబాయిలోని మారియెట్ హోటల్ లో ఏం జరిగిందో మహేశ్ గారిని అడగండి అంటూ చెప్పారు. మహేశ్ సిగ్గు పడిపోతూ, ఇద్దరమ్మాయిలు వచ్చి ఫోటో అడిగితే, ఫ్యామిలీతో ఉన్నానని చెప్పాను. తరువాత రమేశ్ వచ్చి, సార్ వాళ్ళు డైరెక్టర్ శంకర్ గారి కూతుళ్ళు అని చెప్పగానే మళ్ళీ కిందకు వచ్చి చూశాను. అప్పుడు శంకర్ గారు కూడా అక్కడ ఉన్నారు. సారీ, సర్ మీ అమ్మాయిలని తెలియదు అని చెప్పాను. అందుకు ఆయన కూడా వాళ్లకు కూడా తెలియాలి కదా హీరోలంటే ఎలా ఉంటారో అని అన్నారు
అని వివరించారు. తరువాత కొరటాల శివ భరత్ అనే నేను
క్లయిమాక్స్ లో జరిగిన సంఘటన గుర్తు చేశారు వీడియోలో. దానిని మహేశ్ వివరించారు. అదే సమయంలో బాలయ్య దానవీర శూర కర్ణ
సమయంలో ఓ విశేషాన్ని గుర్తు చేసుకొని వివరించడం ఆకట్టుకుంది.
Read Also : ‘రాధేశ్యామ్’ రన్ టైం ఎంతంటే ?
అవే అల్టిమేట్!
తరువాత షో జరుగుతూండగానే మహేశ్ కు అత్యంత సన్నిహితుడైన దర్శకుడు వంశీ పైడిపల్లిని కూడా ఆహ్వానించగా, ఆయన కూడా ఈ షోలో పాల్గొన్నారు. రాగానే ఓ ప్రశ్నకు సమాధానంగా వంశీతో తన పరిచయం గురించి వివరించారు మహేశ్. వంశీ మహేశ్ గారిని తొలుత మురారి
సినిమా ఆయన, కృష్ణగారితో కలసి చూస్తూండగా సుదర్శన్ 35 ఎమ్.ఎమ్.లో చూశానని గుర్తుచేసుకున్నారు. మహేశ్ ఆల్వేస్ డైరెక్టర్స్ డిలైట్ అంటూ కితాబు నిచ్చారు వంశీ. తొలుత డైరెక్టర్, హీరో రిలేషన్ షిప్ ఉండేది, తరువాత మహేశ్ పాప సితార, మా పాప ఆద్య బెస్ట్ ప్రెండ్స్ అయిపోయారు. ఆ తరువాత తామూ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయ్యామని వివరించారు వంశీ. నా సినిమాలు చూస్తూంటావా అంటూమహేశ్ ను బాలయ్య అడిగారు. మీ ప్రతి సినిమా చూస్తానని మహేశ్ చెప్పారు. ఏ సినిమా నచ్చిందని అడగ్గానే, మీ సినిమాల్లో మీతో బోయపాటి తీసిన సినిమాలు అల్టిమేట్
అని మహేశ్ చెప్పారు.
నా డైలాగ్ నీ గొంతులో వినాలని ఉందయ్యా అంటూ బాలయ్య అడిగారు. నేను మీ డైలాగ్ చెప్పి చెడగొట్టను సార్... మీ డైలాగ్ మీరు తప్ప వేరెవ్వరూ చెప్పలేరు
అని మహేశ్ అన్నారు. ఓ ప్రశ్నకు సమాధానంగా నా సినిమా ఫ్లాప్ అయితే, నేను బాధ పడిపోతుంటాను. ఎందుకంటే నా వల్లే అందరికీ డబ్బులు పోయాయని నేను రెస్పాన్సిబుల్ గా ఫీలవుతాను
అని తెలిపారు మహేశ్.
పేరుకు తగ్గ శ్రీమంతుడు
!
మహేశ్ బాబు కారణంగా పలువురు చిన్నారులకు హృదయ చికిత్సలు జరిగాయి. ఈ నేపథ్యంలో మహేశ్ అందించిన సహాయం ద్వారా ఆరోగ్యవంతులైన పిల్లల ఏవీని ప్రదర్శించారు. ఆ సందర్భంలోనే గౌతమ్ చిన్నప్పుడు అనారోగ్యం పాలయ్యాడని, అప్పుడు తనలో ఈ ఆలోచన మొదలైందని, ఆర్థికబలం లేని చిన్నారులకు సహాయం అందించాలని నిర్ణయించుకున్న విషయాలను మహేశ్ గుర్తు చేసుకున్నారు. ఆ కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులకు ఆహా తరపున బహుమానాలు అందచేశారు. అప్పుడు కూడా ఆ చిన్నారులతో బాలయ్య తనదైన శైలిలో అలరించారు. వెయ్యికి పైగా చిన్నారులకు ఆపరేషన్ చేయించి,రెండు పల్లెటూళ్ళను దత్తత తీసుకొని నిజమైన శ్రీమంతుడు
అనిపించుకున్నావని బాలయ్య, మహేశ్ ను అభినందించారు. మహేశ్... ఈ షోకి నువ్వు అతిథివి కాదు... నా ఆప్తుడివి అంటూ బాలయ్య చెప్పగానే జనంలో ఆనందం వెల్లివిరిసింది. ఈ అన్ స్టాపబుల్ లో ఇది చివరి ఎపిసోడ్ అని, ఈ అన్ స్టాపబుల్ వెనుక ఓకథ ఉందని, అది అతిత్వరలోనే మీ ముందుకు వస్తుందనీ బాలయ్య తెలిపారు. ఇలాంటి ఎన్నెన్నో ముచ్చట్లు పోగేసుకున్న ఈ
గ్రాండ్ ఫినాలే` నందమూరి, ఘట్టమనేని అభిమానులనే కాదు, అందరినీ అలరిస్తుందని చెప్పవచ్చు.