సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘సర్కారువారి పాట’ రిలీజ్ కు సిద్దమవుతుంది. పరుశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మే 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే మహేష్ ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలతో బిజీగా మారాడు. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో మహేష్, బాలీవుడ్ ఎంట్రీ పై కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. హిందీలో నటించే విషయంలో తనకు ఇబ్బంది ఏమీ లేదు.. కానీ, తెలుగులో కంఫర్ట్ గా ఉందని, బాలీవుడ్ నన్ను భరించలేదని, అక్కడికి వెళ్లి టైమ్ వేస్ట్ చేసుకోలేనని సరదాగా మహేష్ అన్న వ్యాఖ్యలు ప్రస్తుతం బాలీవుడ్ లో సంచలనంగా మారాయి. ఈ వ్యాఖ్యల పట్ల బాలీవుడ్ నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
సామాజిక మాధ్యమాల్లోనూ వైరల్ గా మారి చర్చకు దారితీసాయి. దీంతో ఈ వ్యాఖ్యలపై మహేష్ వివరణ ఇచ్చాడు. “హిందీ లో నటించాలనే ఆసక్తి లేదని మాత్రమే చెప్పానని, తనకు అన్ని భాషలపై గౌరవం ఉందని క్లారిటీ ఇచ్చాడు. ఏ భాషలో కంఫర్ట్ ఉంటే అక్కడే నటించాలని తాను భావిస్తానని, ఎన్నో ఏళ్ల నుంచి తెలుగులోనే సినిమాలు చేయడం వల్ల మిగతా పరిశ్రమలతో పోలిస్తే టాలీవుడ్ అంటే సౌకర్యవంతంగా ఉందని చెప్పినట్లు” తెలిపారు. ఇక దీంతో ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పడినట్లు తెలుస్తోంది.